Renu Desai | సామాజిక సేవా కార్యక్రమాల్లో బిజీగా ఉండే నటీమణి రేణూ దేశాయ్ ఇటీవలి కాలంలో సినిమాలపై పెద్దగా స్పందించకపోయినా, తాజాగా బాలీవుడ్లో సంచలనంగా మారిన ‘ధురంధర్’ సినిమా పట్ల అభిమానాన్ని వ్యక్తం చేస్తూ ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది. ఈ మూవీని ప్రతి భారతీయుడు తప్పక చూడాలని కోరుతూ ఆమె చేసిన రివ్యూ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ స్పై థ్రిల్లర్‌లో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించగా, నాన్న సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ సారా అర్జున్ హీరోయిన్గా కనిపించింది. మాధవన్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎన్నో ఇబ్బందులను అధిగమించి విడుదలైన సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. విడుదలైన మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరి బాలీవుడ్లో సంచలన విజయాన్ని నమోదు చేసింది.
ఈ సినిమా వీక్షించిన తర్వాత రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో .. “ప్రతి భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా ధురంధర్. దర్శకుడు ఆదిత్య ధర్ ఒక బ్రిలియంట్ మాస్టర్ పీస్ ఇచ్చాడు. మనల్ని క్షేమంగా ఉంచడానికి భారత సైన్యం 24×7 కష్టపడుతుంది. వాళ్ల వల్లే మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాం. ఈ సినిమా చూస్తే ఆ సంగతులు మరింత లోతుగా అర్థమవుతాయి. దేశం గురించి మాట్లాడే కొందరు సూడో సెక్యులర్స్ అయినా ఈ సినిమా చూసి కొంచెం గౌరవం నేర్చుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ దేశం పక్షాన నిలబడాల్సిన సమయం అంటూ రేణూ ఇచ్చిన ఈ స్ట్రాంగ్ స్టేట్మెంట్ సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారి తీస్తోంది.
‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య ధర్, నిజ సంఘటనల ఆధారంగా థురంధర్ చిత్రాన్ని రూపొందించాడు. ట్రేడ్ నిపుణుల ప్రకారం, సినిమా ఇప్పటివరకు రూ.148 కోట్లు దాటేసి రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది.బాలీవుడ్ సర్కిల్స్‌తో పాటు ప్రముఖులు కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తుండగా, రేణూ దేశాయ్ రివ్యూ చిత్రానికి మరింత హైప్ తీసుకొచ్చిందనే చెప్పాలి. రానున్న రోజులలో ఈ మూవీ మరిన్ని రికార్డులు చెరిపేయడం ఖాయంగా కనిపిస్తుంది.