‘Charlie’ actor Radhakrishnan Chakyat | ప్రముఖ ఫోటోగ్రాఫర్, మలయాళీ చిత్రం ‘చార్లీ’లో నటుడిగా మెప్పించిన రాధాకృష్ణన్ చాక్యాత్ (53) గురువారం రాత్రి కన్నుమూశారు. ఆయన ఆకస్మిక మరణం మలయాళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. ముంబైలో నివసిస్తున్న రాధాకృష్ణన్ చాక్యాత్, నిన్న రాత్రి గుండెపోటుతో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు, సన్నిహితులు తెలిపారు. ఆయన ఆకస్మిక మరణం ఫోటోగ్రఫీ, సినీ రంగాల్లో తీరని లోటును సృష్టించిందని సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా టాప్ టెన్ ఫోటోగ్రాఫర్లలో ఒకరిగా పేరుగాంచిన ఆయన, అనేక ప్రముఖ బ్రాండ్లకు ఫోటో షూట్లు నిర్వహించారు. అలాగే దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘చార్లీ’ చిత్రంలో ‘డేవిడ్’ పాత్రతో రాధాకృష్ణన్ చాక్యాత్ నటుడిగానూ ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఫోటోగ్రఫీ, కెమెరా టెక్నిక్స్‌పై అనేక వర్క్‌షాప్‌లు, తరగతులు నిర్వహించి యువ ఫోటోగ్రాఫర్లకు స్ఫూర్తిగా నిలిచారు. అంతేకాకుండా, ‘పిక్సెల్ విలేజ్’ అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఫోటోగ్రఫీకి సంబంధించిన విలువైన సమాచారాన్ని పంచుకుంటూ లక్షలాది మంది సబ్స్క్రైబర్లను సంపాదించుకున్నారు.
రాధాకృష్ణన్ చాక్యాత్ మరణ వార్తను ఆయన టీమ్ ‘పిక్సెల్ విలేజ్స సంతాపం ప్రకటించింది. “మా ప్రియమైన గురువు, స్నేహితుడు, ప్రేరణ అయిన రాధాకృష్ణన్ చాక్యాత్ మరణ వార్తను బాధాతప్త హృదయంతో తెలియజేస్తున్నాము. మా ఫోటోగ్రఫీ ప్రయాణంలో ఆయన ఒక మార్గదర్శి. ప్రపంచాన్ని లెన్స్ ద్వారా ఎలా చూడాలి, దాని ఆత్మను ఎలా బంధించాలో ఆయన మాకు నేర్పించారు. ఆయన కుటుంబానికి, స్నేహితులకు, ఆయన ఉనికితో ప్రభావితమైన ప్రతి ఒక్కరికీ మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము” అని ‘పిక్సెల్ విలేజ్’ ఒక ప్రకటనలో పేర్కొంది.