Chevalier Award | ప్రముఖ భారతీయ కళా దర్శకుడు (ఆర్ట్ డైరెక్టర్) తోట తరణికి ఫ్రాన్స్ ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన ‘చెవాలియర్’ (Chevalier Award) గౌరవాన్ని ప్రకటించింది. భారతీయ కళారంగంలో, సినీ నిర్మాణ రూపకల్పన (Production Design)లో ఆయన చేసిన అద్భుతమైన కృషికి గాను ఫ్రాన్స్ ప్రభుత్వం ఆయనకు ‘చెవాలియర్ డె లా లీజియన్ డి హానర్’ (Chevalier de l’Ordre des Arts et des Lettres) పురస్కారాన్ని అందించనుంది. ఈ ప్రతిష్టాత్మక గౌరవాన్ని చెన్నైలోని ఫ్రెంచ్ కాన్సులేట్‌లో నవంబర్ 13న ఫ్రెంచ్ రాయబారి ఆయనకు స్వయంగా ప్రదానం చేయనున్నారు.
1978లో ‘సొమ్మొకడిది సోకొకడిది’తో ఆర్ట్ డైరెక్టర్‌గా పరిచయమైన తరణి నాలుగు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. తెలుగులో ‘సాగర సంగమం’, ‘శివ’, ‘ఖైదీ నెం. 150’, ‘కుబేర’, ‘అతడు’, ‘హరిహర వీరమల్లు’, ‘ఘాటి’
వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కళా దర్శకుడిగా పని చేశాడు. అలాగే తమిళంలో ‘నాయకన్’, ‘ఇండియన్’, ‘దశావతారం’, ‘పొన్నియిన్ సెల్వన్’ వంటి గొప్ప చిత్రాలకు కళా దర్శకత్వం వహించి రెండుసార్లు జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. భారత ప్రభుత్వం కూడా 2001లోనే ఆయన సేవలకు గాను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ఈ అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కడంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ సహా పలువురు సినీ ప్రముఖులు తోట తరణికి అభినందనలు తెలిపారు. సత్యజిత్ రే, శివాజీ గణేశన్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ వంటి భారతీయ దిగ్గజాలు అందుకున్న జాబితాలో తోట తరణి కూడా చేరడం భారతీయ కళాకారులకు ఎంతో గర్వకారణమని స్టాలిన్ పేర్కొన్నారు.