బాలీవుడ్ చిత్రాల్లో వ్యాపార ధోరణి మరింతగా పెరిగిపోయిందని, స్క్రిప్ట్ దశలోనే సినిమాను లాభాలకు అమ్ముకునే విషయం గురించి ఆలోచిస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్. దక్షిణాది చిత్రసీమలో సృజనాత్మకతకు, పని సంస్కృతికి పెద్దపీట వేస్తారని, బిజినెస్ మైండ్‌సెట్ తక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో సౌత్ ఇండస్ట్రీకి షిప్ట్ అయ్యే ఆలోచన ఉందని ఆయన తెలిపారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలీవుడ్లో ప్రయోగాత్మక చిత్రాలను తీయడం చాలా కష్టమైన పని. కథా చర్చల సమయంలోనే అది వర్కవుట్ కాదని అంటారు. అందుకే నేను దక్షిణాదికి వెళ్దామనుకుంటున్నా. అక్కడి ప్రజలు సినిమాను ఎంతగానో ప్రేమిస్తారు. ‘మంజుమ్మల్ బాయ్స్’ లాంటి సినిమాను బాలీవుడ్లో ఊహించడం చాలా కష్టం. అలాంటి సినిమాలు హిట్ అయితే హిందీలో రీమేక్‌కు మాత్రం ప్రయత్నిస్తారు. ఇక్కడంతా వ్యాపారమే’ అని అనురాగ్‌కశ్యప్ విమర్శించారు. బాలీవుడ్ క్యాస్టింగ్ ఏజన్సీలు పరిశ్రమకు చాలా నష్టం కలిగిస్తున్నాయని, నటీనటులకు యాక్టింగ్ ట్రెయినింగ్ ఇప్పించే బదులు వారిని జిమ్‌లకు పంపించి బాడీ బిల్డింగ్ చేయిస్తున్నారని అనురాగ్‌కశ్యప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు బాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారాయి.