AP Deputy CM | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కళ్యాణ్ తన వ్యక్తిత్వ హక్కులు (Personality Rights) కాపాడాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా తమ ఫోటోలను, వీడియోలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో మార్ఫింగ్ చేసి దుర్వినియోగం చేస్తున్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై చర్యలు తీసుకోవాలని ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అయితే పవన్ పిటిషన్‌ని శుక్రవారం విచారించిన ఢిల్లీ హైకోర్టు ఈ విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. పవన్ కళ్యాణ్ ఫోటోలు, వీడియోలు దుర్వినియోగం అవుతున్న లింకులను 48 గంటల్లోగా తమకు అందించాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఆదేశించింది. అంతేకాకుండా, ఆ లింకులపై వారం రోజుల్లోగా తగిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. పవన్ కళ్యాణ్ ఇమేజ్ను వీడియోలను ఉపయోగించి AI ద్వారా సృష్టించిన తప్పుడు కంటెంట్‌ను తొలగించాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను న్యాయస్థానం డిసెంబర్ 22కు వాయిదా వేసింది. ఢిల్లీ హైకోర్టు తాజా ఆదేశాలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తాత్కాలికంగా ఊరట లభించినట్లయింది.