రెండేండ్లుగా హిట్లు లేక మొహం వాచిపోయిన బాలీవుడ్‌కు బాద్ షా అండగా నిలుస్తున్నాడు. కొన్నాళ్లుగా స్తబ్ధుగా ఉన్న కింగ్ ఖాన్ ఈ ఏడాది తనదేనని గ్రాండ్‌గా చెబుతున్నాడు. ‘పఠాన్’ మూవీతో కలెక్షన్ల సునామీ సృష్టించి.. ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా కింగ్ ఈజ్ కింగ్ అని నిరూపించాడు. అదే ఊపులో ‘జవాన్’ సినిమాతో ఈ వారమే బాక్సాఫీస్‌పైకి దండెత్తి వస్తున్నాడు షారుఖ్ ఖాన్. పఠాన్ రికార్డులన్నీ మళ్లీ అతనే బద్దలుకొడతాడని బాద్ షా ఫ్యాన్స్ బెట్టింగులకు సిద్ధమవుతున్నారు. అదే నిజమైతే కింగ్ ఖాన్‌తోపాటు బాలీవుడ్ కూడా ఊపిరి పీల్చుకున్నట్టే అని బీ టౌన్లో వార్తలు వినిపిస్తున్నాయి. మొదటి రోజే ‘జవాన్’ వంద కోట్ల రూపాయల క్లబ్లో చేరిపోతుందని సినిమా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే నిజమైతే ఒకే ఏడాది మొదటిరోజు వందకోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసిన రెండు సినిమాల్లో నటించిన హీరోగా షారుఖ్ రికార్డు సృష్టించనున్నాడు. తమిళం, తెలుగు డబ్బింగ్ వెర్షన్లు కూడా అదే రోజు విడుదల కానున్నాయి. దీంతో వందకోట్లు వసూలు చేయడం ఖాయమని చెబుతున్నారు. షారుఖ్ సంగతి పక్కన పెడితే.. ఈ చిత్రం విజయం సాధిస్తే.. బాలీవుడ్‌కు మళ్లీ ఊపు వస్తుందని ఆశపడుతున్నది ఇండస్ట్రీ!