‘హరోం హర’ చిత్రం ప్రేక్షకులకు కొత్త థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అందిస్తుందని, కథానుగుణంగా సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్. సుధీర్‌బాబు హీరోగా జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ బుధవారం పాత్రికేయులతో మాట్లాడుతూ ‘హై ఇంటెన్సిటీ యాక్షన్, ఎమోషన్స్ ఉన్న కథాంశమిది.
రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్‌లో ప్రేక్షకులకు కొత్త ఫీల్‌ని అందిస్తుంది. భావోద్వేగప్రధానంగా నడిచే కథ కాబట్టి మ్యూజిక్కు మంచి స్కోప్ దొరికింది. 1989లో జరిగే కథ ఇది. నాటి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లుగా ప్రజెంట్ చేస్తున్నాం. మ్యూజిక్ కూడా రెట్రో ఫీల్‌తో ఉంటుంది. స్వతహాగా నాకు రెట్రో జోనర్ అంటే చాలా ఇష్టం. అందుకే ఈ సినిమాను ఓ సవాలుగా తీసుకొని పనిచేశాను. సినిమా కథ, విజువల్స్‌కు తగినట్లు మంచి క్వాలిటీ మ్యూజిక్ చేశాననే సంతృప్తి ఉంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తున్నది. ప్రస్తుతం గోపీచంద్ ‘విశ్వం’ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నా’ అన్నారు.