‘వంద సంవత్సరాల క్రితం జరిగిన ఓ భయంకర సంఘటన మళ్లీ పునరావృతమై ఎంతో మంది ప్రాణాలను కోల్పోతుంటారు. ఆ కేసును చేపట్టిన పోలీసులు అదృశ్యమవుతుంటారు. ఆ మిస్టరీని యువ ఆర్కియాలజిస్ట్ ఎలా ఛేదించిందో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’ అని అంటోంది రెజీనా. ఆమె కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘నేనే నా?’. కార్తిక్‌రాజు దర్శకుడు. రాజశేఖర్‌వర్మ నిర్మాత. ఈ చిత్ర ట్రైలర్‌ను విజయ్‌సేతుపతి, నిధి అగర్వాల్, దర్శకుడు లింగుస్వామి సంయుక్తంగా విడుదలచేశారు. ఈ ట్రైలర్లో ఆర్కియాలజిస్ట్‌గా, మహారాణిగా రెండు పాత్రల్లో రెజీనా కనిపిస్తోంది. గతం, వర్తమానం రెండు కాలాల్ని మేళవిస్తూ ఉత్కంఠభరితంగా ట్రైలర్ సాగుతోంది. నిర్మాత మాట్లాడుతూ ‘హారర్ కథాంశంతో తెరకెక్కుతున్న రివేంజ్ థ్రిల్లర్ ఇది. రెజీనా పాత్ర భిన్న పార్శాలతో సాగుతుంది. ఇందులో ఆమె ద్విపాత్రాభినయం చేస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సామ్ సీఎస్, ఛాయాగ్రహణం: గోకుల్ బినోయ్.