RC15 Budget | రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా సినిమా గురించి ఆశ్చర్యపరిచే అప్డేట్స్ వస్తున్నాయి. తమ సంస్థ 50వ సినిమాగా దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి మరో సర్ప్రైజింగ్ న్యూస్ బయటకొచ్చింది.
బ్యూరోక్రసీ, పొలిటికల్ విబేధాల నేపథ్యంతో యాక్షన్ ఎంటర్టైనర్గా డైరెక్టర్ శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఫైట్స్ విషయంలో శంకర్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ పోరాట సన్నివేశాలను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ సీన్స్‌కే దాదాపు 10 కోట్ల రూపాయలు కేటాయించినట్లు సమాచారం. పాన్ ఇండియా సినిమాలకు రిటర్న్స్ కూడా అదేస్థాయిలో ఉంటాయి కాబట్టి నిర్మాత ఖర్చుకు వెనకాడటం లేదు.
శంకర్ సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటాయి. ఆయన మొదటి సినిమా జెంటిల్మెన్ నుంచి ప్రేమికుడు, ఒకే ఒక్కడు, భారతీయుడు, రోబో…ఇలా ఏ సినిమా తీసుకున్నా ఫైట్స్ స్పెషల్‌గా ప్లాన్ చేసుకుంటారు. ఇక ఇప్పుడు టెక్నాలజీ, బడ్జెట్లు ప్రస్తుత ట్రెండ్‌లో శంకర్ మరింత క్వాలిటీగా చేసేందుకు సిద్ధమవుతున్నారు. కియారా అద్వానీ నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్, అంజలి, జయరామ్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది శంకర్ చరణ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.