రామ్‌చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. విలేజ్ స్పోర్ట్స్ డ్రామా ఇది. బుచ్చిబాబు సానా దర్శకుడు. ఇటీవల విడుదలైన గ్లింప్స్ సినిమాపై ఒక్కసారిగా అంచనాల్ని పెంచింది. ఈ సినిమా పూర్తయిన తర్వాత రామ్‌చరణ్-సుకుమార్ కాంబో సినిమా పట్టాలెక్కనుంది. ఏడాది క్రితమే ఈ సినిమా తాలూకు అధికారిక ప్రకటన వెలువడింది. అయితే ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో అసలు ఈ సినిమా ప్రీప్రొడక్షన్ ఎంతవరకు వచ్చింది? షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? అంటూ అభిమానుల్లో చర్చ మొదలైంది.
‘ఆర్సీ17’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా గురించి సుకుమార్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వెల్లడించారు. ఇటీవల తన స్వగ్రామానికి వెళ్లిన ఆయన ‘ఆర్సీ17’ గురించి మాట్లాడారు. తన తదుపరి సినిమా రామ్‌చరణ్‌తోనే ఉంటుందని, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్నామని, ప్రీప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుగుతున్నదని తెలిపారు. దీంతో అభిమానులకు ఈ సినిమాపై ఓ క్లారిటీ వచ్చినైట్లెంది. ‘రంగస్థలం’ వంటి బ్లాస్‌బస్టర్ హిట్ తర్వాత సుకుమార్-రామ్‌చరణ్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా పూర్వ నిర్మాణ దశలోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ‘రంగస్థలం’ తరహాలోనే పతాక స్థాయి భావోద్వేగాలను ఆవిష్కరిస్తూ, ఓ సంఘర్షణాత్మక కథతో దర్శకుడు సుకుమార్ ఈ సినిమాకు సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది.