రివ్యూ – ‘రావణాసుర’
నటీనటులు – రవితేజ, సుశాంత్, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, మురళీ శర్మ, సంపత్ రాజ్, జయ ప్రకాష్ తదితరులు.
సాంకేతిక నిపుణులు – సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో, సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ కన్నన్, ఎడిటర్: నవీన్ నూలి, కథ, & డైలాగ్స్ : శ్రీకాంత్ విస్సా, నిర్మాతలు: అభిషేక్ నామా, రవితేజ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుధీర్ వర్మ
సరికొత్త కంటెంట్ వెండితెరపై, ఓటీటీలో ఆదరణ పొందుతున్న నేపథ్యంలో స్టార్ హీరోలు కూడా ప్రయోగాత్మక చిత్రాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలా మాస్ హీరోగా పేరున్న రవితేజ చేసిన భిన్నమైన ప్రయత్నం రావణాసుర. ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథ:
నగరంలోని ఓ రిసార్ట్ లో వ్యాపారవేత్త రాధాకృష్ణ (జయ ప్రకాష్)ను విజయ్ తల్వార్ (సంపత్ రాజ్) అనే వ్యక్తి హత్య చేస్తాడు. ఈ హత్య కేసును ఇన్వెస్టిగేషన్ చేసే బాధ్యతను పోలీస్ కమిషనర్ నరసింహ (మురళీ శర్మ) పోలీస్ అధికారి హనుమంతరావు (జైరామ్)కు అప్పగిస్తాడు. విజయ్ తల్వార్ కూతురు హారిక (మేఘా ఆకాష్) తన తండ్రి ఈ హత్య చేయలేదని చెబుతూ ఆ కేేసును వాదించమని లాయర్ కనకమహాలక్ష్మి (ఫరియా అబ్దుల్లా)ని కోరుతుంది. కనకమహాలక్ష్మి తాను ఈ కేసు వాదించనని చెబుతుంది. అయితే ఆమె దగ్గర జూనియర్ లాయర్ గా పనిచేస్తున్న రవీంద్ర (రవితేజ) హారికను తొలిసారి చూడగానే ప్రేమిస్తాడు. ఆమెకు దగ్గరయ్యేందుకు ఈ కేసును టేకప్ చేయమని కనకమహాలక్ష్మిని ఒప్పిస్తాడు. ఇంతలో పోలీస్ కమిషనర్ నరసింహను స్థానిక రౌడీ గోలీ పహిల్వాన్ హత్య చేస్తాడు. హారిక కూడా అనుమానాస్పదంగా మృతి చెందుతుంది. ఈ హత్యలన్నీ ఎవరు చేస్తున్నారు. ఈ హత్యలకు లాయర్ రవీంద్రకు ఉన్న సంబంధం ఏంటి. మాస్క్ మేకర్ సాకేత్ (సుశాంత్), అతని ప్రేయసి జానకి (దక్షా నగార్కర్)ని తన పనుల కోసం రవీంద్ర ఎలా ఉపయోగించుకున్నాడు. హంతకుడిని పోలీస్ అధికారి హనుమంతరావు ఎలా పట్టుకున్నాడు అనేది మిగిలిన కథ.
+ఫ్లస్ పాయింట్స్:
సుశాంత్, దక్ష నటన
సినిమాటోగ్రఫీ
-మైనస్ పాయింట్స్:
ఆకట్టుకోని కథ, కథనాలు
తేలిపోయిన ట్విస్టులు
లోపించిన వినోదం
ఎలా ఉందంటే:
‘ధమాకా’ సూపర్ హిట్ తర్వాత రవితేజ నటించిన సినిమా కాబట్టి సహజంగానే రావణాసురపై అంచనాలు ఏర్పడ్డాయి. నెగిటివ్ టైటిల్, ట్రైలర్ తో ఆసక్తి కలిగించడం సినిమా పట్ల ప్రేక్షకుల్ని ఆకర్షించింది. కొత్త ప్రయత్నం ఏదో చేసి ఉంటారనే అభిప్రాయాన్ని సినిమా కలిగించింది. థియేటర్ లో అడుగుపెట్టిన కొద్ది సేపటికే ఈ అభిప్రాయం తప్పని తెలిసిపోతుంది. జూనియర్ లాయర్ గా ఉంటూ మరోవైపు హత్యలు, రేప్ లు చేస్తుంటాడు హీరో. అతను ఎందుకిలా చేస్తున్నాడనే నేపథ్యం ఎంత బలమైనది అయినా సరే ఓ స్టార్ హీరో ఇలా క్రూరంగా ప్రవర్తించడం ప్రేక్షకులకు రుచించదు. సినిమా ప్రారంభం నుంచీ ఒక్కటంటే ఒక్క సీన్ మెప్పించదు. పాత్రల ప్రవర్తన అసహజంగా సాగుతుంటుంది. సాకేత్ పాత్రలో సుశాంత్, జానకిగా దక్షా నగార్కర్ లవ్ ట్రాక్ ఒక్కటే సినిమా మొత్తంలో జెన్యూన్ గా అనిపిస్తుంది. ఈ జంట భావోద్వేగాలకు మాత్రమే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. తానే హంతకుడిని అని, అయితే సాక్ష్యాలు లేకుండా తననేం చేయలేరని హీరో చెప్పడం, నిందితుడు కళ్ల ముందే ఉన్నా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోరో అర్థం కాదు. హీరోకు అడ్డొచ్చే సంఘర్షణ సినిమా మొత్తంలో ఎక్కడా ఉండదు. అతను చేసిందే హీరోయిజం.
బెంగాళీ సినిమా విన్సీ దా స్ఫూర్తితో ఈ సినిమా చేసినట్లు తెలుస్తున్నది. ఇది రవితేజ లాంటి స్టార్ హీరో చేయాల్సిన సినిమా కాదు. కొత్త నటీనటులతో ఓ చిన్న బడ్జెట్ సినిమా రూపొందిస్తే కనీసం ఓ కొత్త ప్రయత్నం అనిపించుకునేదేమో. కాసేపు ఉపశమనం పొందే వినోదం ఎక్కడా కనిపించదు. హీరో ఫ్రెండ్ గా హైపర్ ఆది వేసిన పంచ్ లు ఒక్కటీ పేలలేదు. ఈ సినిమాకు సంగీతం మరో పెద్ద మైనస్. వెయ్యినొక్క జిల్లాల వరకు పాటను సాధ్యమైనంత పాడు చేశారు. దాన్ని అలాగే పెట్టుకున్నా బాగుండేది.
చివరగా.. మెప్పించని రావణాసుర’
రేటింగ్ : 2.25/5