నిన్నుకోరి, మజిలీ చిత్రాలతో యువతతోపాటు కుటుంబ ప్రేక్షకుల మనసుల్ని కూడా గెలుచుకున్నారు దర్శకుడు శివ నిర్వాణ. ఆయన దర్శకత్వంలో రానున్న సినిమా ‘ఇరుముడి’. రవితేజ హీరోగా ఈ సినిమాను ప్రకటించిన నాటి నుంచీ అంచనాలు భారీగా నెలకొన్నాయి. ప్రచార చిత్రాలు సైతం సినిమాపై ఆసక్తిని పెంచాయి. మైత్రీ మూవీమేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘ఇరుముడి’ చిత్రం ఈ నెల 21న థియేటర్లలోకి రానున్నది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో డైరెక్టర్ శివ నిర్వాణ విలేకరులతో మాట్లాడారు.
‘ఇరుముడి’ కథలో మూడు లేయర్లు ఉంటాయి. ఒకటి అయ్యప్పమాల నేపథ్యం.. రెండోది కుటుంబ నేపథ్యం.. మూడోది క్రైమ్ యాంగిల్. ఇది రవితేజను దృష్టిలో పెట్టుకొని రాసిన కథ కాదు. అయితే.. ఆయనకు వినిపించాక, ఈ పాత్రకు ఆయనే కరెక్ట్ అనే క్లారిటీ వచ్చింది. రవితేజ గడ్డం, ఆయన తేజస్సు ఆపాత్రకు అద్భుతంగా సరిపోయాయి. ఇందులో ఆయన పాత్ర పేరు త్రినాథ్. కూతురంటే ప్రాణం. ఆ కూతురు పేరు మణెమ్మ. ఆ పాత్రకు మట్టివాసన కావాలి. ఇంట్లో పాపలా ఉండాలి. అలాంటి పాపకోసం వెతుకుతున్నప్పుడు బేబీ నక్షత్ర ఇన్‌స్టా రీల్స్ చూశాం. ఆమెను పిలిపించి, లుక్ టెస్ట్ చేసి, తనతో రెండు వీడియోలు షూట్ చేసి, అప్పుడు ఓకే చేశాం. రవితేజ, నక్షత్రా కాంబినేషన్ సీన్స్ సినిమాకు ప్రధాన బలం.
‘ఇరుముడి’ ఓ కొత్త సెటప్. ఎవరూ టచ్ చేయని పాయింట్‌ని చెప్తున్నప్పుడు.. దాన్ని ఒక యాక్టర్ చేస్తే ఒకలా ఉంటుంది. అదే స్టార్ చేస్తే మరోలా ఉంటుంది. కుటుంబనేపథ్యం, అయ్యప్పమాల, మనసుల్ని తాకే భావోద్వేగాలు ఇవన్నీ ఉన్న ఓ కథను రవితేజ వంటి స్టార్ చేయడం వల్ల ఆ కథ ప్రతి ఇంటికీ చేరుతుంది. రవితేజ కెరీర్లో ఇలాంటి సినిమా రాలేదని చెప్పగలను. అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు ఆయన ఎలా ఉంటాడు.. మాలలో లేనప్పుడు ఎలా ఉంటాడు అనేది ఇందులో ఆసక్తికరంగా ఉంటుంది. అద్భుతమైన స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు కుదిరింది. ఇది చాలా యూనిక్ ఫిల్మ్.
ఈ కథలో అయప్ప దీక్ష కీలకం కావడం వల్ల.. ఆయప్పమాలపై రీసెర్చ్ చేశాను. మాల ధరించి, భజనలకు వెళ్లా. సహచర దర్శకుడు హను రాఘవపూడితో కలిసి శబరిమల వెళ్లా. అవన్నీ షూటింగ్లో కలిసొచ్చాయి. ఈ సినిమాలో అయ్యప్ప భజనలు, పాటలు గూజ్బంప్స్ తెప్పిస్తాయి. సీలేరు ప్రాంతంలో అయప్ప భక్తులు ఎక్కువగా పాడుకునే ‘మల్లెపూల పల్లకీ’ సాంగ్ ఈ సినిమాకోసం రీక్రియేట్ చేశాం. ఆ పాట సినిమాకే హైలైట్. ఇక ప్రియా భవానీశంకర్, సాయికుమార్ పాత్రలు కూడా నేచురల్‌గా ఉంటాయి. సాంకేతికంగా సినిమా చాలా రిచ్‌గా ఉంటుంది. తప్పకుండా అందరి అంచనాలనూ ‘ఇరుముడి’ అందుకుంటుందని నమ్మకంతో చెప్పగలను.