రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. శరత్ మండవ దర్శకుడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, రవితేజ టీం వర్క్ పతాకాలపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకురానుంది. శనివారం హైదరాబాద్‌లో ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ధర్మాన్ని గెలిపించడానికి ఓ ఎమ్మార్వో చేసిన పోరాటం నేపథ్యంలో ట్రైలర్ శక్తివంతంగా సాగింది. హత్యల చిక్కుముడిని విప్పడానికి చేసే పరిశోధన సస్పెన్స్‌ను పంచింది. ‘ఇన్నాళ్లు ఓ గవర్నమెంట్ ఆఫీసర్‌గా చట్టప్రకారం న్యాయం కోసం డ్యూటీ చేసిన నేను ఇకపై రామారావుగా ధర్మ కోసం డ్యూటీ చేస్తాను’..‘అసలు వేట మొదలైంది’ అంటూ రవితేజ చెప్పిన సంభాషణలు ఆకట్టుకున్నాయి. దర్శకుడు శరత్ మండవ మాట్లాడుతూ ‘చాలా మంది కథలు రాస్తారు. అయితే మూవీ స్క్రిప్ట్ సినిమాగా కార్యరూపం దాల్చాలంటే నటుల సహకారం చాలా ముఖ్యం.
తెలుగు ఇండస్ట్రీలో రవితేజలాంటి నటుడు ఉండటం అదృష్టంగా భావిస్తున్నా. నాలాంటి కొత్త దర్శకులకు ఆయన స్ఫూర్తిగా నిలుస్తారు. కొత్త వారిని ప్రోత్సహిస్తూ వారి ఆలోచనలకు విలువిస్తారు. ఈ సిని మా తప్పకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. అభిమానులకు పండగలా ఉంటుంది’ అన్నారు. రవితేజ మాట్లాడుతూ ‘ట్రైలర్ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. దర్శకుడు శరత్ మంచి సినిమా తీశాడు. టెక్నీషియన్స్ అందరూ చక్కటి ఎఫర్ట్స్ పెట్టారు. అభిమానుల్ని మెప్పించే అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయి’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో త్రినాథ రావు నక్కిన, సుధీర్‌వర్మ తదితరులు పాల్గొన్నారు. వేణు తొట్టెంపూడి, నాజర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సత్యన్ సూర్యన్, ఆర్ట్: సాహి సురేష్, నిర్మాణ సంస్థలు: ఎస్ఎల్వీ సినిమాస్, రవితేజ టీమ్ వర్క్స్, కథ; స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శరత్ మండవ.