Director Harish Shankar | రవితేజ కథానాయకుడిగా హరీశ్‌శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘మిస్టర్ బచ్చన్’ చిత్రం ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకురానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. సోమవారం సాయంత్రం కర్నూల్లో ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ ‘ఈ సినిమాలోని ప్రతి బ్లాక్ అందంగా ఉంటుంది. మిక్కీ జే మేయర్ నుంచి ఇలాంటి మ్యూజిక్ వస్తుందని ఊహించలేదు. సూపర్బ్ ఆల్బమ్ ఇచ్చాడు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వరుసగా సినిమాలు చేస్తూ విజయాలు సాధించాలని కోరుకుంటున్నా. హరీశ్‌శంకర్ సినిమా కోసం చాలా హార్డ్‌వర్క్ చేస్తాడు. ఈ సినిమాతో మా మా ఇద్దరి కాంబినేషన్లో మరో విజయం పక్కా అని నమ్ముతున్నా’ అన్నారు. దర్శకుడు హరీశ్‌శంకర్ మాట్లాడుతూ ‘ఈ శుక్రవారం రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రెండింటిని బ్లాక్‌బస్టర్ చేయాలని కోరుతున్నా. విశ్వప్రసాద్‌గారికి ఉన్న పాషన్ వల్లే ఈ సినిమాను ఫాస్ట్‌గా పూర్తిచేశాం.
పీపుల్ మీడియాలో ఇక వరుసగా సినిమాలు చేస్తాను. ఈ సినిమా టైటిల్‌ను రవితేజ పెట్టారు. ఆయన కారణంగానే నేను జీవితంలో ఈ స్టేజీకి వచ్చాను. ‘షాక్’ చిత్రం ద్వారా నాకు సినీ జన్మనిచ్చి, ‘మిరపకాయ్’ ద్వారా పునర్జన్మనిచ్చారు. రవితేజ లేకుండా నా సినీ కెరీర్ లేదు. ‘మిస్టర్ బచ్చన్’కు రిపీట్ ఆడియెన్స్ వస్తారనే నమ్మకం ఉంది’ అన్నారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో చాలా సర్‌ప్రైజ్‌లున్నాయి. ఫుల్ మాస్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల్ని అలరిస్తుంది’ అన్నారు.