Ravi Teja | వరుస పరాజయాలతో కెరీర్లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నారు మాస్ మహారాజా రవితేజ. ‘వాల్తేర్ వీరయ్య’ తర్వాత ఆయన నుంచి వచ్చిన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాయి. ఈ ఏడాది భారీ అంచనాలతో వచ్చిన ‘మాస్ జాతర’ కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో రవితేజకు ఇప్పుడు ఒక గట్టి హిట్ అత్యవసరంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన ఆశలన్నీ ప్రస్తుతం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాపైనే నిలిచాయి. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్స్ శరవేగంగా సాగుతున్నాయి.
తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఇద్దరి భామల మధ్య నలిగిపోతున్న వ్యక్తిగా రవితేజ తన కామెడీతో తెగ నవ్విస్తున్నాడు. ప్రస్తుతం ఈ ట్రైలర్ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది. ఈ ట్రైలర్ చూశాక ఫ్యాన్స్ మూవీ హిట్ అంటున్నారు. ఇక రవితేజ కెరీర్లో ఇది 76వ చిత్రం కావడం విశేషం. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, నటీనటులు, సాంకేతిక బృందం పారితోషికాలు, నిర్మాణ ఖర్చులు, ప్రచార వ్యయాలు అన్నీ కలిపి ఈ సినిమాకు సుమారు 35 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యిందని తెలుస్తోంది. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే… ఈ ప్రాజెక్ట్ కోసం రవితేజ ముందస్తుగా రెమ్యునరేషన్ తీసుకోలేదని సమాచారం. సినిమా లాభాల్లోకి వస్తే, అందులో తన వాటాను తీసుకుంటానని ఆయన నిర్మాతలకు హామీ ఇచ్చినట్లు వినిపిస్తోంది.
ఈ సినిమాలో రవితేజ సరసన ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సునీల్, సత్య, వెన్నెల కిశోర్, సుధాకర్, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బీమ్స్ సిసిరిలియో సంగీతం అందించగా, ఏ. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ప్రసాద్ మూరేళ్ల సినిమాటోగ్రఫీ నిర్వహించారు. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.రవితేజ వరుస ఫ్లాపుల ప్రభావం ఈ సినిమా బిజినెస్‌పైనా కనిపించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ డీల్స్ పెద్దగా జోష్ చూపలేకపోయినప్పటికీ, డిజిటల్ మరియు శాటిలైట్ హక్కులను జీ స్టూడియోస్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.ఈ సంక్రాంతికి చిన్నా పెద్దా కలిపి ఏడెనిమిది సినిమాలు బరిలో ఉన్న నేపథ్యంలో, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. మాస్ మహారాజాకు ఇది కమ్‌బ్యాక్ హిట్ అవుతుందా, లేక కష్టకాలం ఇంకా కొనసాగుతుందా అన్నది జనవరి 13 తర్వాత తేలనుంది.