Ravi Teja | మాస్ మహారాజ్ రవితేజ కెరీర్ గత కొన్నేళ్లుగా ఆశించిన స్థాయిలో సాగడం లేదు. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ, ప్రేక్షకుల్లో ఆ సినిమాలు పూర్తి సంతృప్తిని కలిగించలేకపోయాయి. మాస్ ఇమేజ్‌కు కాస్త విరామం ఇచ్చి, క్లాస్ టచ్‌తో చేసిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ కూడా సంక్రాంతి బరిలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దీంతో రవితేజ తదుపరి ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.ఈ క్రమంలోనే ఆయన దర్శకుడు శివ నిర్వాణతో చేతులు కలిపారు. ఈ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.
అయ్యప్ప స్వామి మాలధారణలో రవితేజ కనిపించిన లుక్ సోషల్ మీడియాలో మంచి స్పందన తెచ్చుకుంది. పోస్టర్ చూసిన వెంటనే ఒక డివోషనల్ ఫీల్, పాజిటివ్ వైబ్స్ కలుగుతున్నాయన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయ్యప్ప మాలధారణలో ఇరుముడికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యతను ఈ సినిమాలో ఎమోషనల్‌గా, డీప్‌గా చూపించబోతున్నారని సమాచారం. సెన్సిటివ్, క్లాస్ కథనాలతో పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ ఈసారి డివోషనల్ టచ్‌తో కథను తెరకెక్కిస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. మాస్కు భిన్నంగా, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా ద్వారా రవితేజ కొత్త ఇమేజ్ను ఆవిష్కరించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఈ చిత్రానికి జీ.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇక అయ్యప్ప మాలధారణ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, 2026 ఎండింగ్లో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ‘ఇరుముడి’ రవితేజ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందా? అనే ఆసక్తి ఇండస్ట్రీలోనూ, అభిమానుల్లోనూ పెరుగుతోంది.