‘నాది రాతి గుండె. నాకు సాధారణంగా ఏడుపు రాదు. అలాంటిది ఈ సినిమా చూసి ఏడ్చాను. జీవీప్రకాశ్ సంగీతం ఈ సినిమాకి సోల్. సినిమా చూస్తున్నప్పుడు ఆ మ్యూజిక్ వల్ల ఆటోమేటిగ్గా ఆడియన్స్ కళ్లలో నీళ్లు వచ్చేస్తున్నాయి. మా అమ్మాయి మోక్ష కూడా సినిమా చూస్తూ కన్నీరు పెట్టుకుంది. ఆడియన్స్ రియాక్షన్ చూస్తుంటే నా కళ్లు చెమర్చాయి. త్రినాథ్ పాత్ర, ‘ఇరుముడి’ కథ డైరెక్టర్ శివ నిర్వాణ చెప్పగానే నెక్ట్స్ లెవెల్ అనిపించింది.
ఈ సినిమా విజయంపై నిర్మాతలు మొదట్నుంచీ నమ్మకంతో ఉన్నారు. వారి నమ్మకం నిజమైంది’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు అగ్ర కథానాయకుడు రవితేజ. ఆయన హీరోగా రూపొందిన హార్ట్ విన్నింగ్ ఎమోషనల్ డ్రామా ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మేకర్స్ సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన బ్లాక్ బస్టర్ ప్రెస్మీట్లో రవితేజ మాట్లాడారు. ఇంకా చెబుతూ ‘కోవిడ్ టైమ్‌లో తమిళం, మలయాళ సినిమాలు ఎక్కువగా చూశాం.
అవన్నీ రూటెడ్‌గా ఉండేవి. మనం కూడా అలాంటి కంటెట్‌తో సినిమా చేస్తే బావుంటుంది కదా అనిపించేది. ‘ఇరుముడి’తో ఆ కోరిక తీరింది. ఈ సినిమాకు వస్తున్న స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘ఇరుముడి’ గురించే మాట్లాడుకుంటున్నారు. సాంకేతికంగా అన్ని విధాలా సినిమా సమర్థనీయంగా ఉంది. నటీనటులంతా అద్భుతమైన ప్రతిభను కనపరిచారు. ఎప్పుడో 20ఏండ్ల క్రితం థియేటర్‌కి వచ్చిన వాళ్లు ‘ఇరుముడి’ చూడటం కోసం థియేటర్లకు రావడం చాలా ఎమోషనల్‌గా అనిపిస్తున్నది. ఇది మూమూలు ఆనందం కాదు.
ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు దర్శకుడు శివ నిర్వాణకు థ్యాంక్స్’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు రవితేజ. ఈ స్పందన చూసి ఎలా రియాక్టవ్వలో అర్థం కావడం లేదని, మాటలకందని రియాక్షన్ ఇదని, ఒక దర్శకుడికి, నిర్మాతకి, హీరోకి, పంపిణీదారుడికీ, ప్రేక్షకుడికి ఒక సినిమా ఎంత ఇవ్వాలో ‘ఇరుముడి’ అంత ఇచ్చిందని, ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని దర్శకుడు శివ నిర్వాణ అన్నారు. ‘ఈ సినిమాకు వస్తున్న స్పందన చూసి ఆనందంతో నోట మాట రావడం లేదు. ఇక ‘ఇరుముడి’కి ఎదురే లేదు. చాలా పెద్ద నంబర్స్ కనిపిస్తున్నాయి. విడుదలైన రోజున్నరలోనే లాభాల్లోకి రావడం యాభై ఏళ్లలో ఎప్పుడూ జరగలేదని డిస్ట్రిబ్యూటర్స్ చెప్తుంటే చెప్పలేనంత ఆనందంగా ఉంది’ అని నిర్మాతలు రవిశంకర్, నవీన్ ఎర్నేని చెప్పారు. ఇంకా ప్రియా భవానీశంకర్, బేబీ నక్షత్ర, సాయికుమార్, అనంతశ్రీరామ్, స్వసిక, డీఓపీ విష్ణు కూడా మాట్లాడారు.