Rashmika | ఒకప్పుడు సినిమాల్లో ఐటం పాట అంటే ప్రత్యేకంగా ప్రొఫెషనల్ డాన్సర్లే గుర్తొచ్చేవారు. ఆ పాటల్లో వాళ్లు కనిపిస్తేనే హిట్ అనే స్టాండర్డ్ ఉండేది. కానీ కాలం మారింది. ఇప్పుడు అదే సినిమాలో హీరోయిన్గా నటించిన నటీమణులే ఐటం సాంగ్స్‌లోనూ స్టెప్పులేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఒకే సినిమాలో హీరోయిన్ పారితోషికంతో పాటు స్పెషల్ సాంగ్ ఫీజు కూడా అందుకుంటూ డబుల్ లాభం పొందుతున్నారు.ఈ ట్రెండ్‌కు అనుగుణంగానే గత కొన్నేళ్లుగా సమంత, కాజల్ అగర్వాల్, తమన్నా, పూజా హెగ్డే, శ్రీలీల వంటి స్టార్ హీరోయిన్లు ఐటం పాటల్లో కనిపించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ ఇదే ట్రెండ్ బలంగా కొనసాగుతోంది. ముఖ్యంగా పెద్ద సినిమాల్లో ఐటం సాంగ్ అంటే స్టార్ హీరోయిన్ ఉండాల్సిందే అనే పరిస్థితి ఏర్పడింది.
ఈ క్రమంలోనే ‘నేషనల్ క్రష్’గా గుర్తింపు పొందిన రష్మిక మందన్నా కూడా ఈ దారిలోకి అడుగుపెట్టింది. బాలీవుడ్ డెబ్యూ ‘గుడ్‌బై’లో నటిగా మెప్పించిన ఆమె, తర్వాత వచ్చిన ‘థామా’ చిత్రంలో నటనతో పాటు స్పెషల్ సాంగ్‌లోనూ తనదైన స్టైల్లో ఆకట్టుకుంది. ఆ పాట తర్వాత రష్మికపై ఐటం భామగా కూడా డిమాండ్ పెరిగింది. దర్శక, నిర్మాతలు “హీరోయిన్గా తీసుకున్నా, ఐటం సాంగ్‌కు కూడా ఒప్పించొచ్చు” అనే ధీమాతో ఆమె వైపు చూస్తున్నారనే టాక్ వినిపించింది. కానీ ఇదే సమయంలో రష్మిక ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తాను నటిగా అయినా, ఐటం భామగా అయినా కేవలం ఇద్దరు దర్శకుల సినిమాల్లో మాత్రమే స్పెషల్ సాంగ్స్ చేస్తానని, అంతకుమించి ఈ విషయంలో చాలా సెలెక్టివ్‌గా ఉంటానని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరు దర్శకులు ఎవరో మాత్రం ఇప్పుడే వెల్లడించలేనని, సరైన సమయంలో తానే చెబుతానని చెప్పిందట. దీంతో రష్మిక ఐటం పాటల విషయంలో స్పష్టమైన హద్దులు పెట్టుకున్నారనే చర్చ మొదలైంది.
ఈ నిర్ణయం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రష్మికపై భారీ ఆశలు పెట్టుకున్న కొంతమంది దర్శకులు ఈ షరతులతో కాస్త నిరాశకు గురైనట్లు సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో ఆమెకు ఉన్న క్రేజ్‌ను ఎన్‌క్యాష్ చేసుకోవాలని చాలామంది ప్లాన్స్ వేస్తుండగా, ఈ కండీషన్ వాళ్లకు షాక్ ఇచ్చిందని టాక్.అయితే రష్మిక మాత్రం ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘మైసా’లో కీలక పాత్రలో నటిస్తుండగా, విజయ్ దేవరకొండ 14వ సినిమాలోనూ హీరోయిన్గా ఎంపికైంది. మరోవైపు బాలీవుడ్లో ‘కాక్టెయిల్ 2’ వంటి పెద్ద ప్రాజెక్ట్‌లో నటిస్తోంది. నటిగా, డాన్సర్‌గా తనను తాను విభిన్నంగా ప్రెజెంట్ చేసుకుంటూనే, అవసరమైతేనే ఐటం పాటలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలన్నదే రష్మిక స్ట్రాటజీగా కనిపిస్తోంది.