‘పుష్ప’ ఫ్రాంఛైజీ, ‘యానిమల్’ ‘ఛావా’ చిత్రాలతో జాతీయ స్థాయిలో పేరుప్రఖ్యాతుల్ని సంపాదించుకుంది అగ్ర నాయిక రష్మిక మందన్న. తాజాగా ఆమె ‘మైసా’ చిత్రంతో కెరీర్లోనే ఓ ఛాలెంజింగ్ రోల్‌ని పోషిస్తున్నది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో గిరిజన తెగకు చెందిన గోండ్ మహిళగా కనిపించనుంది రష్మిక మందన్న. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాల్ని పెంచాయి. ఈ సినిమాలోని యాక్షన్ ఘట్టాల కోసం రష్మిక మందన్న ప్రతిరోజూ 8 గంటల కఠోర శిక్షణ తీసుకుంటున్నది. అంతర్జాతీయ యాక్షన్ డైరెక్టర్ ఆండిలాంగ్ పర్యవేక్షణలో బ్యాంకాక్‌లో ఈ ట్రెయినింగ్ జరుగుతున్నది.
‘మైసా’ కథ విన్న తర్వాత పాత్ర కోసం తాను శారీరకంగా, మానసికంగా మరింత దృఢంగా కనిపించాలని రష్మిక నిర్ణయించుకుందని, యాక్షన్ ఘట్టాలన్నీ సహజంగా కనిపించాలనే లక్ష్యంతో బ్యాంకాక్‌లో స్టంట్స్, కంబాట్ ట్రెయినింగ్ తీసుకుంటున్నదని మేకర్స్ తెలిపారు. శనివారం ఇందుకు సంబంధించిన పోస్టర్స్‌ను విడుదల చేశారు. త్వరలో కేరళలో 16రోజుల పాటు జరిగే కీలక యాక్షన్ షెడ్యూల్ కోసం రష్మిక మందన్న ఈ శిక్షణ తీసుకుంటున్నది. ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్, నిర్మాతలు: అన్‌ఫార్ములా ఫిల్మ్స్, రచన-దర్శకత్వం: రవీంద్ర పుల్లె.