అగ్ర కథనాయిక రష్మిక మందన్న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రంతో ఈ నెల 7న ప్రేక్షకుల్ని పలకరించబోతున్నది. దీక్షిత్‌శెట్టి హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సమకాలీన స్త్రీపురుష సంబంధాల నేపథ్యంలో సరికొత్త ప్రేమకథగా తెరకెక్కిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మిస్తున్నారు. విడుదల తేదీ దగ్గరపడటంతో ప్రచార కార్యక్రమాల జోరు పెంచారు. శుక్రవారం ‘కురిసే వాన..’ అంటూ సాగే ఓ పాటను విడుదల చేశారు.
రాకేందుమౌళి సాహిత్యాన్నందించిన ఈ పాటను కపిల్ కపిలన్ పాడారు. హేషమ్ అబ్దుల్ వాహాబ్ స్వరకర్త. ‘కురిసే వాన తడిపేయాలన్న భూమే ఏదో, సరదా పడుతూ పురి విప్పేస్తున్న నెమలే ఏదో, ఓ నీలి మేఘం, పెంచింది వేగం, జాబిలమ్మ చెంత చేరి వంతపాడి కమ్మితే మైకం’ అంటూ ప్రేమికుల మనోభావాల్ని ఆవిష్కరిస్తూ మెలోడీ ప్రధానంగా సాగిందీ గీతం. రావు రమేష్, రాహుల్ రవీంద్రన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహాబ్, రచన-దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్.