Rashmika Mandanna | మాటల్లో పొరపాట్లు దొర్లడం సహజం. ముఖ్యంగా సినిమాల విషయంలో ఓ పేరుకు బదులు మరో పేరు చెప్పేయడం ప్రతి ఒక్కరికీ జరుగుతూనే ఉంటుంది. ఇటీవల రష్మిక మందన్నా ఓ ఇంటర్వ్యూలో అలాంటి పొరపాటే చేసింది. విజయ్ ‘గిల్లీ’ సినిమా గురించి మాట్లాడుతూ ‘నేను థియేటర్లో చూసిన తొలి సినిమా ‘గిల్లీ’. వెండితెరపై చూసిన తొలి హీరో విజయ్ సార్. అందులోని పాటలంటే నాకు చాలా ఇష్టం. ఆ పాటలకు ఎన్నోసార్లు స్టేజ్‌పై డాన్సులు చేశా.’ అని చెప్పుకొచ్చింది. అంతవరకూ బాగానే ఉంది.. చివర్లో ‘గిల్లీ.. తెలుగులో మహేశ్ సార్ నటించిన ‘పోకిరి’కి రీమేక్’ అని సెలవిచ్చేసింది. నిజానికి ‘గిల్లీ’.. మహేశ్ ‘ఒక్కడు’ సినిమాకు రీమేక్.
మరి సోషల్ మీడియా ఊరుకుంటుందా!? ట్రోల్స్ మొదలయ్యాయి. ఆ వీడియో షేర్ చేస్తూ, రష్మికను ఆటపట్టించడం మొదలుపెట్టారు. దాంతో నాలిక కరుచుకున్న మన నేషనల్ క్రష్.. వెంటనే మరో వీడియో పోస్ట్ చేసింది.. ‘గిల్లీ.. ఒక్కడు రీమేక్ కదా.. ఇంటర్వ్యూ అవ్వగానే అనుకున్నా వీడియోను ట్రోల్ చేస్తారని.
అనుకున్నట్టే జరిగింది.. నిజంగా సారీ.. ‘పోకిరి’ని అదే పేరుతో తమిళంలో రీమేక్ చేశారుకదా.. నాకు తెలుసు. ఏదేమైనా నాకు వారి సినిమాలన్నీ ఇష్టమే..’ అంటూ ఫన్నీ ఎమోజీలు జోడించింది రష్మిక. ఇదిలావుంటే.. ‘పుష్ప2’ హిట్‌తో మంచి జోష్ మీదున్న ఈ అందాల భామ చేతులో ప్రస్తుతం దక్షిణాదితోపాటు బాలీవుడ్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. కుబేరా, ఛావా, సికిందర్, ది గర్లఫ్రెండ్ చిత్రాల్లో ఆమె నటిస్తున్నది.