వరుస విజయాలతో అలరిస్తోంది రష్మిక మందన్న (Rashmika Mandanna). తన ఎంచుకునే కథలు, పాత్రల్లో వైవిధ్యం వుంటుంది. తొలిసారిగా తానే ప్రధాన పాత్రలో ఓ సినిమా చేసింది. అదే ‘ది గర్ల్‌ఫ్రెండ్’(The Girlfriend). దీక్షిత్ శెట్టి (Dikshith Shetti) మరోపాత్రలో కనిపించినప్పటికీ గర్ల్‌ఫ్రెండ్ రష్మిక సినిమానే ప్రచారంతోనే జనాల్లోకి వచ్చింది. రష్మిక మంచి ఫామ్ లో వుండటం, గీతా ఆర్ట్స్ నుంచి ఈ సినిమా రావడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరా అంచనాలని గర్ల్‌ఫ్రెండ్ అందుకుందా? రష్మిక సోలో హిట్ కొట్టిందా ? రివ్యూలో చూద్దాం.
భూమా (రష్మిక మందన్న) పీజీ చేయడానికి హైదరాబాద్ లోని ఓ కాలేజ్ లో జాయిన్ అవుతుంది. అదే కాలేజ్ లో పీజీ చేయడానికి వచ్చిన విక్రమ్ (దీక్షిత్ శెట్టి) భుమాని ఇష్టపడతాడు. ఒక బలహీనమైన క్షణంలో భూమా కూడా విక్రమ్ ని ఇష్టపడుతుంది. విక్రమ్ కి జెలసీ, పోసిస్సివెన్స్ ఎక్కువ. తనది పాత కాలం మనస్తత్వం. విక్రమ్ తో రోజులు గడుపుతున్నకొద్ది భూమాకి కొన్ని విషయాలు అర్ధమౌతూవస్తుంటాయి. రిలేషన్షిప్ లో ఓ చిన్న బ్రేక్ కావాలని ఆడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? విక్రమ్ ఎలా రియాక్ట్ అయ్యాడు ? ఈ కథలో దుర్గా (అను ఇమ్మానుయేల్) పాత్ర ఏమిటి? చివరికి భూమా ఎలాంటి నిర్ణయం తీసుకుందనేది మిగతా కథ.
ఒక డీసెంట్ అమ్మాయికి, బయటికి మాత్రమే డీసెంట్ గా కనిపించే ఓ అబ్బాయి మధ్య జరిగే లవ్- బ్రేకప్ కథది. ప్రేమించిన అమ్మాయికి తను తప్పితే ఎవరూ అవసరం లేదని, పెళ్లి తర్వాత అమ్మాయి ఇంటికి పరిమితం కావాలనుకునే ధోరణిలో వుండే అబ్బాయిని ప్రేమించిన అమ్మాయి.. కొంత జర్నీ తర్వాత ఆ బంధం తనని ఉక్కిరిబిగ్గిరి చేస్తుందనే నిజాన్ని గ్రహించి ప్రేమకి గుడ్ బై చెప్పి మళ్ళీ కొత్త జీవితం ప్రారంభించడానికి ఎంత ధైర్యం చూపించాల్సివచ్చిందనే ఈ కథలో సారం. మంచి పాయింట్ ఇది. దర్శకుడు రాహుల్ చిత్రాన్ని ప్రేమకథలానే నడిపినా ఆ తర్వాత హీరో పాత్రలో వచ్చిన మార్పు ఈ కథని మరో దిశగా తీసుకెళుతుంది.
విరామ ఘట్టం వరకూ కథలో సంఘర్షణ ఎమిటనేది ఆడియన్స్ కి అంతగా రిజిస్టర్ కాకపోయినప్పటికీ.. వంటగది కుందేలుగా కనిపించిన రోహిణి ఎపిసోడ్ తర్వాత ఈ కథ మీద, హీరో క్యారెక్టర్ మీద ఆసక్తిఏర్పడుతుంది. ఇంటర్వెల్ తర్వాత కథని కాస్త సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. రాహు రమేష్, రష్మిక, దీక్షిత్ మధ్య కాలేజ్ లో జరిగే ఘర్షణ సమయంలోనే రష్మిక బ్రేక్ చెప్పే అవకాశం వచ్చింది. విక్రమ్ లాంటి వాడు తనకి కరెక్ట్ కాదనే భూమా తేల్చేవచ్చు. కానీ ఆ పాయింట్ మరింత స్ట్రెచ్ చేశారు. బహుశా అమ్మాయిలు అంత తేలిగ్గా బ్రేకప్ చెప్పలేరనేది ఉద్దేశం కావచ్చు. బ్రేకప్ తర్వాత భూమా ఎదురుకున్న పరిస్థితులు, అక్కడి నుంచి తనలో వచ్చిన మార్పు, క్లైమాక్స్ భూమా ఇచ్చిన స్పీచ్ ఆకట్టుకునేలా వున్నాయి. అమ్మాయిలా కోణంలో చూసినప్పుడు ఈ సినిమా మరింత అద్భుతంగా వుంటుంది.

భూమా పాత్రకి రష్మిక ప్రాణం పోషించింది. స్టేజ్ అంటే భయపడే అమ్మాయి .. చివరి స్టేజ్ ఎక్కి తన కథని ధైర్యంగా చెప్పుకోవడం ఈ పాత్ర మారిన తీరుని చక్కగా చిత్రీకరించింది. బ్రేకప్ చెప్పే సన్నివేశాల్లో, క్లైమాక్స్ సీక్వెన్స్ లో ఆమె నటన మరోస్థాయిలో వుంటాయి. లవర్ గా మొదలై సైకోలా మారిపోయిన పాత్రలో కనిపించాడు దీక్షిత్. ఈ కథలో విలన్ లాంటి పాత్ర తనది. తన నటన పాత్రకు తగ్గట్టుగా సహజంగా కుదిరింది. రావు రమేష్ కి ఇలాంటి పాత్రలు కొత్తకాదు. విక్రమ్ తో గొడవపడే సీన్ ఇంటెన్స్ గా వచ్చింది. అను ఇమ్మానుయేల్ పాత్ర నిడివి చిన్నగా వున్న కథలో కీలకమైయింది. రోహిణి పాత్రకి డైలాగ్ లేదు. కానీ గుర్తుండిపోతుంది. రాహుల్ రవీంద్రన్ హెచ్‌వోడీ గా మెప్పించారు. మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి.
హేషమ్ పాటలు కథకు తగ్గట్టుగా వున్నాయి. ప్రశాంత్ ఆర్.విహారి నేపథ్య సంగీతం ఎమోషన్ ని ఎలివేట్ చేసింది. కృష్ణన్ వసంత్ విజువల్స్ కథ టోన్ ని పట్టుకున్నాయి. దాదాపు ఓ కాలేజ్ లో సాగిపోయే కథ ఇది. ఆ వాతావరణంగా సహజంగా క్రియేట్ చేశారు. గీతా ఆర్ట్స్ నిర్మాణంలో క్యాలిటీ కనిపించింది.