Rashmika Mandanna | టాలీవుడ్లో యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి చైతన్య కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఎపిక్’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ‘బేబీ’ తర్వాత ఈ జోడీకి వస్తున్న మరో ప్రాజెక్ట్ కావడంతో సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘ఎపిక్’ చిత్రాన్ని సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచగా.. ఇప్పుడు ట్రైలర్‌పై మరింత ఆసక్తి నెలకొంది.
సెప్టెంబర్ 5న ‘ఎపిక్’ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్‌లో సాయంత్రం 6 గంటల నుంచి ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉండగా.. ముఖ్య అతిథిగా రష్మిక మందన్న రానుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇటీవల ఓ సినిమా షూటింగ్లో రష్మిక మందన్న గాయపడిన విషయం తెలిసిందే. షూటింగ్ సమయంలో గాయపడటంతో ప్రస్తుతం ఆమె ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటూ కోలుకుంటున్నారు. ఈ సమయంలోనే ఆమె ‘ఎపిక్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు హాజరు కానుండటం ఆసక్తిని రేపుతోంది.
అయితే ఈ ఈవెంట్‌కు రష్మిక రావడం వెనుక ప్రత్యేక కారణం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఆనంద్ దేవరకొండకు ఆమె వదిన వరుస అవుతారు. ఆనంద్ అన్న, హీరో విజయ్ దేవరకొండను రష్మిక వివాహం చేసుకున్న నేపథ్యంలో.. ఇప్పుడు మరిది ఆనంద్ సినిమా ట్రైలర్ లాంచ్‌కు ఆమె ముఖ్య అతిథిగా రావడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్న రష్మిక సాధారణంగా బయట కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ.. ఆనంద్ దేవరకొండ నటించిన ‘ఎపిక్’ ట్రైలర్ లాంచ్ కోసం ఈ ఈవెంట్‌కు హాజరు కానుండటం ప్రత్యేకంగా నిలుస్తోంది. దీంతో ఈ కార్యక్రమంలో రష్మిక ఏం మాట్లాడనుంది? ఆనంద్ సినిమాపై ఎలాంటి కామెంట్స్ చేస్తుంది? విజయ్ దేవరకొండ ఫ్యామిలీ నుంచి ఈ సినిమాకు ఎలాంటి సపోర్ట్ ఉంటుందనే విషయాలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
‘బేబీ’ సినిమాతో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడీకి మంచి క్రేజ్ వచ్చింది. ఆ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ‘ఎపిక్’తో మరోసారి కలిసి నటిస్తుండటంతో ఈ కాంబినేషన్‌పై అంచనాలు పెరిగాయి.