Vijay Deverakonda | టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల అభిమానులకు సరికొత్త సర్ప్రైజ్ లభించింది. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉండి, ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహ బంధంతో ఒకటైన ఈ జంటకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త నెట్టింట వైరల్‌గా మారింది. సాధారణంగా హీరోయిన్లు పెళ్లి తర్వాత భర్త పేరునో లేదా వారి ఇంటిపేరునో తమ పేరు పక్కన చేర్చుకోవడం చూస్తుంటాం. అయితే, వివాహం తర్వాత కూడా రష్మిక తన సోషల్ మీడియా ఖాతాల్లో పాత పేరునే కొనసాగించడంతో, ఆమె పేరు మార్చుకోరని అందరూ భావించారు. కానీ, తాజాగా రష్మిక అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ భర్త ఇంటిపేరును తన పేరుకు జోడించి అఫీషియల్‌గా ప్రకటించారు.
ఈరోజు విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక తన అత్తగారి సొంతూరైన నాగర్‌కర్నూల్ జిల్లా తుమ్మన్‌పేట గ్రామాన్ని సందర్శించారు. అక్కడ ‘ది దేవరకొండ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో 2026 విద్యా సంవత్సరానికి గానూ 9, 10వ తరగతుల్లో అత్యుత్తమ మార్కులతో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకారవేతనాలు (స్కాలర్షిప్స్) అందించే కార్యక్రమం జరిగింది. అయితే ఈ వేదికపై రష్మిక మాట్లాడుతూ తనను తాను మొదటిసారిగా ‘రష్మిక మందన్న దేవరకొండ’గా పరిచయం చేసుకుని అక్కడి వారందరినీ ఆనందంలో ముంచెత్తారు. ఈ రోజు మీ ముందు ఇలా మాట్లాడటం చాలా సంతోషంగా ఉందన్న ఆమె, కష్టపడి మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. జీవితంలో గెలుపోటములు సహజమని, ప్రతి అనుభవం నుండి పాఠాలు నేర్చుకుంటూ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని విద్యార్థులకు హితవు పలికారు. బహిరంగ వేదికపై రష్మిక తన పేరును మార్చి పలకడం ఇదే తొలిసారి కావడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Eeroju nenu Rashmika Mandanna Devarakonda la maatladuthunna…
– #RashmikaMandanna speech at #TheDeverakondaFoundation scholorship distribution program pic.twitter.com/1DFeSmt51r
— PRO Suresh (SK Media) (@SKMedia_PR) June 14, 2026