సాంఘిక మాధ్యమం అనేది పరిశ్రమలో చాలామందికి వ్యసనంగా, ఇంకా చెప్పాలంటే శాపంగా మారిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రష్మిక మందన్నా అన్నారు. సోషల్ మీడియాలో నెగెటివిటీ గురించి మాట్లాడుతూ ఆమె పై రీతిగా స్పందించారు. ‘పాజిటివ్ కామెంట్స్ వందల్లో ఉన్నప్పటికీ, ఎక్కడో ఒక మూల ఉన్న నెగెటివ్ కామెంట్ మనశ్శాంతిని పూర్తిగా దెబ్బతీస్తుంది. రోజంతా పడ్డ కష్టాన్ని, తద్వారా వచ్చిన ఆనందాన్ని క్షణాల్లో మాయం చేస్తుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నేనూ.. నా సినిమాలు విడుదలైన సమయంలో విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటాను. రిలీజ్ రోజులో పగటిపూట వాతావరణం చాలా బావుంటుంది. కామెంట్లన్నీ సానుకూలంగా కనిపిస్తాయి. రాత్రి 9గంటలు దాటాక నెగెటివిటీ, ట్రోలింగ్ ఒక్కసారిగా పెరుగుతుంది. రోజంతా ప్రశాంతంగా ఉన్న నెటిజన్లు, రాత్రి కాగానే ఎందుకు అంతలా మారిపోతారో అర్థంకాదు. దీనివల్ల రాత్రి 9గంటలు దాటాక ఎట్టి పరిస్థితుల్లోనూ సోషల్ మీడియా ఓపెన్ చేయకూడదనేది ఇండస్ట్రీలో గోల్డెన్ రూల్‌గా మారింది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు రష్మిక మందన్నా.