రంగం ఏదైనా మనం వేసే తొలి అడుగుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. తన కెరీర్లోనూ బాలీవుడ్ అరంగేట్రం గొప్ప అనుభూతిని మిగిల్చిందని చెబుతోంది రష్మిక మందన్న. తొలి చిత్రం ద్వారా ఎన్నో కొత్త విషయాల్ని నేర్చుకునే అవకాశం దొరికిందని అంటోంది. ‘మిషన్‌మజ్ను’ సినిమాతో బాలీవుడ్లో తొలి అడుగు వేస్తోంది రష్మిక మందన్న. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ను పూర్తిచేసుకుందామె. ఈ సందర్భంగా రష్మిక మందన్న మాట్లాడుతూ “మిషన్ మజ్ను’ సినిమాతో హిందీ భాష, సంస్కృతుల గురించి తెలుసుకున్నా. బాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు అక్కడి పనితీరుపై అవగాహన వచ్చింది. ఉత్తరాది రాష్ర్టాలను సందర్శించాలనే నా కల నెరవేరింది. సినిమా కథ విన్న వెంటనే మరో ఆలోచన లేకుండా అంగీకరించా. ఇలాంటి అరుదైన పాత్రలు ఒక్కసారి చేజారితే మళ్లీ చేసే అవకాశం రాదని అనిపించింది. నటనపరంగా నాకున్న హద్దుల్ని చెరిపేస్తూ నన్ను నేను కొత్తగా పునరావిష్కరించుకునే ఛాన్స్ లభించింది. సినిమా షూటింగ్ పూర్తయిందంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. జీవితకాలం మర్చిపోలేని జ్ఞాపకాల్ని ఈ చిత్రం మిగిల్చింది’ అని పేర్కొన్నది.