మంచి నటిగా రాణించాలంటే కేవలం ప్రతిభ ఒక్కటే సరిపోదని, చక్కటి వ్యక్తిత్వం కూడా అవసరమని చెప్పింది అగ్ర కథానాయిక రష్మిక మందన్న. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ సినిమాలతో బిజీగా ఉన్న ఈ కన్నడ సొగసరి మంగళవారం ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో ముచ్చటించింది. వారు అడిగిన ప్రశ్నలకు తనదైన హాస్యచతురత, వ్యంగ్యం కలబోసి సమాధానాలిచ్చింది. కుటుంబ సభ్యుల ప్రేమానురాగాలతో పాటు, ఎంతగానో ఇష్టపడే తన చిన్నారి సోదరి, ప్రాణప్రదంగా ప్రేమించే స్నేహితుల తోడ్పాటుతో వృత్తిలో ఆశావహదృక్పథంతో దూసుకుపోతున్నానని చెప్పింది. విజయ్ దేవరకొండతో మీకున్న అనుబంధం గురించి చెప్పమని కోరగా..విజయ్ తనకు గొప్ప స్నేహితుడని పేర్కొంది. అనతికాలంలోనే అగ్ర కథానాయికగా ఎదిగారు..మీ సక్సెస్ సీక్రెట్ ఏంటనే అడగ్గా… విజయానికి దగ్గరి దారులుండవని, కష్టించి పనిచేయడం ఒక్కటే మార్గమని వివరించింది. సులభంగా లభించినదేదీ జీవితంలో సంతోషాన్ని తీసుకురాదని తెలిపింది. దేవుడు ప్రత్యక్షమై కేవలం ఒకే ఒక కోరికను తీర్చే వరమిస్తే ఏం చేస్తారని ప్రశ్నించగా…లోకంలోని బాధనంతా మటుమాయం చేసి అందరి ముఖాల్లో సంతోషం వెల్లివిరిసేలా చేయమని కోరతానని చెప్పింది. ధూమపానాన్ని తాను అసహ్యించుకుంటానని..తన చుట్టుపక్కల ఎవరైనా సిగరెట్ కాల్చితే అసౌకర్యంగా ఫీలవుతున్నానని తెలిపింది. మంచి వ్యక్తిత్వంతో పాటు డబ్బుల విషయంలో పొదుపుగా ఉండే అబ్బాయిలు తనకు బాగా నచ్చుతారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రష్మిక మందన్న తెలుగులో పుష్ప, ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రాల్లో నటిస్తోంది.