బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘ధురంధర్’ పాత రికార్డులను బద్దలు కొట్టుకుంటూ దూసుకుపోతున్నది. మరి ఈ రికార్డుల వేట ఎక్కడ ఆగుతుందో సినీ పరిశీలకులకు సైతం అంతుచిక్కడం లేదు. తాజాగా ఈ సినిమా రూ.1000కోట్ల మార్క్‌ను దాటేసింది. దీంతో ఈ ఏడాది దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ‘దురంధర్’ నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రస్తుతం 4,753 థియేటర్లలో ప్రదర్శింపబడుతుండగా, ఒక్క మనదేశంలోనే రూ.668 కోట్లు వసూళ్లు రాబట్టినట్టు సినీ వర్గాలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ రూ.1006 కోట్లు వసూలు చేసినట్టు సినీ వర్గాలు పేర్కొన్నాయి.
దీంతో ఈ ఏడాది బాలీవుడ్లో విడుదలైన ‘స్త్రీ 2’(రూ.598), ‘ఛావా’(రూ.601)లను అధిగమించి, ఈ ఏడాదిలోనే నంబర్‌వన్ సినిమాగా ‘దురంధర్’ నిలిచింది. అంతేకాదు, హీరో రణ్‌వీర్‌సింగ్, దర్శకుడు ఆదిత్యధర్ కెరీర్లలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘దురంధర్’ రికార్డు క్రియేట్ చేసింది.
తొలిరోజు నుంచే వసూళ్ల పరంగా దూకుడుని ప్రదర్శిస్తున్న ‘దురంధర్’.. 21వ రోజుకు రూ.26కోట్లను సాధించడం విశేషం. ఈ దూకుడు ఇక ముందు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాకు ఎదురుగా ఉన్న సవాళ్లు కల్కి 2898ఏడీ, కేజీఎఫ్ చాప్టర్ 2, ఆర్ఆర్ఆర్, పుష్ప 2, బాహుబలి 2, దంగల్. మరి వీటిల్లో వేటిని ‘దురంధర్’ అధిగమిస్తాడో చూడాలి.