3 Idiots 2 | ఇండియన్ సినిమాను ఒక ఊపు ఊపేసిన ‘3 ఇడియట్స్’ చిత్రానికి సీక్వెల్ రాబోతుందని తెలిపాడు మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్. ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ ప్రస్తుతం ‘3 ఇడియట్స్ 2’ స్క్రిప్ట్‌పై కసరత్తు చేస్తున్నారని, ఈ కథ మొదటి భాగం ముగిసిన పదేళ్ల తర్వాత జరిగే పరిణామాల నేపథ్యంలో ఉండబోతోందని ఆయన వెల్లడించారు. ఇటీవల బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమీర్ మాట్లాడుతూ.. హిరానీ వినిపించిన ఈ కథ అద్భుతంగా ఉందని, మొదటి భాగంలో ఉన్న హాస్యం మరియు భావోద్వేగాలు ఇందులోనూ పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు. అభిజిత్ జోషి, రాజ్‌కుమార్ హిరానీ కలిసి ఒక అసాధారణమైన కథను సిద్ధం చేశారని, ఈ ప్రాజెక్ట్ కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆమీర్ తెలిపారు. మరోసారి ఫున్షుక్ వాంగ్డు (రంచో) పాత్రలో కనిపించే అవకాశం రాబోతుండటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఇక ‘3 ఇడియట్స్’ చిత్రం విషయానికి వస్తే.. 2009లో విడుదలైన ఈచిత్రం భారతీయ విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ, స్నేహం, ఇష్టమైన రంగంలో రాణించాలనే సందేశాన్ని ఇస్తూ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆమీర్ ఖాన్‌తో పాటు ఆర్. మాధవన్, శర్మన్ జోషి, కరీనా కపూర్ నటించిన ఈ చిత్రం అప్పట్లో రూ.200 కోట్ల మార్కును దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించింది. చాలా కాలంగా ఈ సినిమా సీక్వెల్ గురించి చర్చలు జరుగుతున్నప్పటికీ, ఆమీర్ స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. అయితే రాజ్‌కుమార్ హిరానీతో ఆమీర్ చేయాలనుకున్న ‘దాదాసాహెబ్ ఫాల్కే’ బయోపిక్ మాత్రం స్క్రిప్ట్ పరమైన కారణాల వల్ల ప్రస్తుతానికి నిలిచిపోయినట్లు సమాచారం.
మరోవైపు ఆమీర్ ఖాన్ కెరీర్ విషయానికి వస్తే, ఆయన భారత్‌పే కో-ఫౌండర్ అశ్నీర్ గ్రోవర్ బయోపిక్‌లో నటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. రాహుల్ మోడీ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటించే ఛాన్స్ ఉంది, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం ఆమీర్ ఖాన్ తన కుమారుడు జునైద్ ఖాన్ నటించిన ‘ఏక్ దిన్’ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం మే 1న విడుదల కానుంది. ఈ ప్రమోషన్ల వేదికగానే ఆమీర్ ‘3 ఇడియట్స్ 2’ గురించి అప్డేట్ ఇచ్చి నెట్టింట భారీ హైప్‌ను క్రియేట్ చేశారు.