Vindu Dhara Singh | ప్రభాస్ కథానాయకుడిగా ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆదిపురుష్’ సినిమాపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణ్’ టీజర్‌పై దివంగత నటుడు దారసింగ్ కుమారుడు, నటుడు విందు దారసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల విడుదలైన రామ టీజర్లో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడి లుక్ అద్భుతంగా ఉందంటూ ప్రశంసించిన ఆయన.. అదే సమయంలో మేకర్స్‌కు ఒక సున్నితమైన హెచ్చరిక చేశాడు. రామాయణం వంటి పవిత్ర కావ్యాన్ని తెరకెక్కించేటప్పుడు మూల కథ నుంచి ఏమాత్రం పక్కకు జరిగినా ప్రేక్షకులు అస్సలు ఒప్పుకోరని ఆయన స్పష్టం చేశాడు.
విందు దారసింగ్ తండ్రి అయిన దిగ్గజ నటుడు దారసింగ్.. గతంలో రామానంద్ సాగర్ రూపొందించిన ‘రామాయణ్’ సీరియల్లో హనుమంతుడి పాత్రలో జీవించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న విందు మాట్లాడుతూ.. రామాయణ్ టీజర్ చాలా అద్భుతంగా, ఎంతో అందంగా ఉంది. అయితే ఇక్కడ ఒక కఠినమైన నియమం ఉంది. రామానంద్ సాగర్ గారు తీసిన రామాయణం మనందరి హృదయాల్లో, మనస్సుల్లో బలంగా నాటుకుపోయింది. అది ఒక చరిత్ర, ఎప్పటికీ నెంబర్ వన్. ఇప్పుడు రాబోతున్న సినిమా ఆ స్థాయిని అందుకుంటే మాత్రం రికార్డులను తిరగరాసే సూపర్ హిట్ అవుతుంది. కానీ కథలో అనవసర మార్పులు చేసినా, పాత్రలను మరీ భయంకరంగా అసురుల తరహాలో చూపించినా జనాలు అస్సలు అంగీకరించరు అని విందు పేర్కొన్నాడు.
గతంలో వచ్చిన ‘ఆదిపురుష్’ సినిమాను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు నేను చూసిన దాన్ని బట్టి తివారీ గారి ‘రామాయణ్’ చాలా మెరుగ్గా కనిపిస్తోంది. అసలు ఆదిపురుష్‌లో ఏం చూపించారో నాకే అర్థం కాలేదు. ఆ ట్రైలర్ చూసినప్పుడే ఆ సినిమా ప్లాప్ అవుతుందని నాకు అర్థమైపోయింది. అందులో అసలు ఏం జరుగుతోంది? మరీ ముఖ్యంగా హనుమంతుడి వంటి పవిత్రమైన పాత్రల విషయంలో అంతలా మార్పులు చేయకూడదని విందు తెలిపాడు.
రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ పౌరాణిక చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, కన్నడ స్టార్ యశ్ రావణాసురుడిగా మరియు సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్నారు. నమిత్ మల్హోత్రా దాదాపు రూ. 4000 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర మొదటి భాగం 2026 దీపావళి కానుకగా మరియు రెండవ భాగం 2027లో విడుదల కానున్నాయి.