Nitish Tiwari | బాలీవుడ్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న పౌరాణిక దృశ్యకావ్యం ‘రామాయణ’కు సంబంధించిన తాజా అప్డేట్స్ సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రముఖ దర్శకుడు నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో బాలీవుడ్ అగ్ర కథానాయకుడు రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన వీడియోను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఈ వీడియో ద్వారా రణ్‌బీర్ కపూర్ రాముడి గెటప్‌లో ఎలా కనిపించబోతున్నారో మేకర్స్ స్పష్టం చేయడంతో అభిమానుల్లో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.
ఈ గ్లింప్స్ విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక వేదికపై దర్శకుడు నితీశ్ తివారీ తన మనసులోని భావాలను పంచుకున్నాడు. ఈ అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించడం కోసం తాను గత ఏడేళ్లుగా కష్టపడుతున్నాని ఆయన వెల్లడించారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎదురైన ఎన్నో సవాళ్లను అధిగమించడానికి తనకు ప్రేక్షకులు చూపించే ప్రేమే స్ఫూర్తిగా నిలిచిందని, ఇప్పుడు వారి నుంచి వస్తున్న అద్భుతమైన స్పందన చూశాక తన ఏడేళ్ల నిరీక్షణకు తగిన ఫలితం దక్కినట్లుగా అనిపిస్తోందని ఆయన ఎమోషనల్ అయ్యారు. కాగా, రామయణంను వెండితెరపై అత్యద్భుతంగా ఆవిష్కరించేందుకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదివేల మంది సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది
మరోవైపు ఈ సినిమాలో రాముడి పాత్రను పోషిస్తున్న రణ్‌బీర్ కపూర్ కూడా మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 2000లో తాను విదేశాల్లో విజువల్ ఆర్ట్స్ కోర్సు చేస్తున్న సమయంలో, భవిష్యత్తులో మన సంస్కృతి మరియు సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప చిత్రంతో ఇక్కడికి తిరిగి వస్తానని తన స్నేహితుడికి చెప్పానని, ఇప్పుడు ‘రామాయణ’ చిత్రంతో తన ఆనాటి కల నెరవేరిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఈ సినిమాలో నటించడానికి తాను మొదట్లో కొంత సంకోచించానని, కానీ తాను తండ్రి అయిన తర్వాత తన ఆలోచనల్లో వచ్చిన పరిణతి వల్లే భయాన్ని వీడి ఈ చారిత్రాత్మక పాత్రను చేసేందుకు ధైర్యంగా ముందుకు వచ్చానని రణ్‌బీర్ చెప్పుకొచ్చారు.
ఈ భారీ చిత్రంలో సీతాదేవిగా సౌత్ స్టార్ హీరోయిన్ సాయిపల్లవి నటిస్తుండగా, లంకాధిపతి రావణాసురుడిగా కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ‘రామాయణ’ మొదటి భాగం రాబోయే దీపావళి పండుగ కానుకగా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది.