Ranbir Kapoor | బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో, ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం ‘రామాయణ’కు సంబంధించిన భారీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రత్యేకమైన గ్లింప్స్ ‘రామ’ను అమెరికాలోని లాస్ ఏంజిల్స్ (LA) లో జరిగిన ఒక ప్రత్యేక ఈవెంట్లో చిత్ర బృందం ప్రదర్శించినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలోని విజువల్స్, రణ్‌బీర్ కపూర్ లుక్‌ను అక్కడి ఐమాక్స్ (IMAX) స్క్రీన్‌పై చూసిన విదేశీ ప్రేక్షకులు షాక్‌కి గురి అయినట్లు తెలుస్తుంది. అత్యంత రహస్యంగా ఈ టీజర్‌ను ప్రదర్శించంగా.. ఈ టీజర్లో రణబీర్ కపూర్ ‘రాముడు’గా బోటులో కూర్చుని వెనక్కి తిరిగే ఒక్క సీన్ థియేటర్లలో పూనకాలు తెప్పించిందని, చూసిన కళ్లలో నీళ్లు తిరిగాయని పలువురు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఇక ఈ ఈవెంట్లో హీరో రణబీర్ కపూర్‌తో పాటు దర్శకుడు నితీష్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రా పాల్గొన్నారు.
గ్లింప్స్ అనంతరం జరిగిన ప్రెస్ మీట్లో శ్రీరాముడి పాత్ర గురించి రణ్‌బీర్ మాట్లాడుతూ.. ‘శ్రీరాముడు కొన్ని శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది ప్రజల మనస్సాక్షిని నడిపిస్తున్న మార్గదర్శి. మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన అలాగే ఉంటారు. కష్ట సమయాల్లో మానవ స్పూర్తి ఎంత గొప్పగా పోరాడగలదో ఆయన మనకు నేర్పించారు. ఆయన దయ, ధైర్యం, ధర్మం మరియు క్షమాగుణాలకు ప్రతీక. అందుకే ఆయనను ‘మర్యాదా పురుషోత్తముడు’ అంటారు. ఇలాంటి గొప్ప పాత్రను పోషించే అవకాశం రావడం నా అదృష్టం’ అని రణబీర్ పేర్కొన్నారు.
మరోవైపు ఈ ‘రామ’ గ్లింప్స్‌ను భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల కోసం ఏప్రిల్ 2న హనుమాన్ జయంతి సందర్భంగా అధికారికంగా విడుదల చేయనున్నారు. సెన్సార్ బోర్డు (CBFC) నుంచి ఈ గ్లింప్స్ ఇప్పటికే అనుమతిని పొందగా.. దీని నిడివి 2 నిమిషాల 38 సెకన్లు ఉంటుందని సమాచారం. దీనికి ‘U’ సర్టిఫికేట్ లభించింది. ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్ నటిస్తుండగా, సీతగా సాయి పల్లవి, రావణుడిగా కేజీఎఫ్ ఫేమ్ యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తున్నారు. అంతేకాకుండా ఈ చిత్రానికి ఆస్కార్ విజేతలు ఏఆర్ రెహమాన్ మరియు హన్స్ జిమ్మెర్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ రెండు భాగాల దృశ్య కావ్యం ‘రామాయణ’ మొదటి భాగం 2026 దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.