సొంతిల్లు ఓ కల. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా, కెపాసిటీని బట్టి ఆ కలను సాకారం చేసుకుంటూవుంటారు జనం. అలాగే మన కపూర్ కపుల్ రణబీర్-అలియా తమ కెపాసిటీని బట్టి ఇల్లు కట్టేసుకున్నారు. దాని విలువ అక్షరాలా 350కోట్లు. ముంబాయిలోని ప్రతిష్టాత్మక కృష్ణరాజ్ బంగ్లా స్థానంలోనే ఈ కొత్త ఇల్లును కట్టుకున్నారు ఈ యువజంట. ముంబైలోని సినీ ప్రముఖులందరి ఇళ్లకంటే ఖరీదైన ఇల్లు ఇదేనని టాక్.
సంప్రదాయాన్నీ, ఆధునికతనూ మేళవిస్తూ నిర్మించుకున్న ఈ కలలసౌధం ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. దీని సెక్యూరిటీ ఫీచర్లు కూడా మామూలుగా లేవు. ఓ మోస్తరు భూకంపాన్ని సైతం తట్టుకునేంత పటిష్టంగా ఈ ఇల్లు నిర్మించబడింది. మొత్తం ఇది ఆరు అంతస్తుల భవంతి. వీటిలో గ్రౌండ్ ఫ్లోర్, మూడో అంతస్తును విల్లాలుగా రూపొందించారు. మొత్తం ఈ జంటకు ఆరు కార్లు ఉన్నాయి. వీటితోపాటు ఓ పదిహేను కార్లను కూడా పార్క్ చేసుకునేంత పార్కింగ్ ప్లేస్ కూడా ఈ భవంతిలో ఏర్పాటు చేశారు. ఇందులో ఓ ఫ్లోర్ పూర్తిగా తన తల్లి నీతూసింగ్కు కేటాయించాడట రణబీర్. ఒక ఫ్లోర్ తన కుటుంబం కోసం. అంటే.. తను, అలియా, పాప కోసం అనమాట. మరో ఫ్లోర్ కేవలం కథలు వినడానికి. మిగతా ఫ్లోర్సన్నీ అతిథులకు.. ఇలా కేటాయించారట. భవనం కోసం వాడిన అద్దాలు, ఫర్నీచర్‌ను ఇటలీ నుంచి తెప్పించారు.
ఇక కిచెన్‌కు సంబంధించిన సామాన్లు, యాక్ససిరీస్ అన్నీ నెదర్లాండ్ నుంచి దిగుమతి చేశారు. ఈ భారీ భవంతిలో రెండు స్విమ్మింగ్ పూల్స్. వాటిలో రణబీర్, అలియా ఫ్లోర్లో ఒకటి, రెండోది టెర్రస్ పైన. టెర్రస్ గార్డెనింగ్ కోసం ఏసియా దేశాల నుంచి మొక్కల్ని తెప్పించారు. ఇక ఈ భవంతిలో అత్యంత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఒకటుంది. అదే.. హాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం. ఆయోధ్య బాలరాముడి విగ్రహాన్ని చెక్కిన అర్జున్ యోగిరాజ్‌తో ఈ విగ్రహాన్ని చెక్కించారు. రెండున్నర అడుగుల పీఠంపై నాలుగు అడుగుల ఎత్తులో ఈ వినాయకుడు కొలువుతీరి ఉంటాడు. అదనమాట విషయం. పిండికొద్దీ కొట్టె.. డబ్బు కొద్దీ విలాసం అంటే ఇదే.