భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం ‘రామాయణ’. రణ్‌బీర్‌కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీత పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్నది. మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి విడుదలకానుంది. గురువారం హనుమాన్ జయంతిని పురస్కరించుకొని టీజర్‌ను విడుదల చేశారు.
‘లోకం అధర్మంతో అల్లకల్లోలంగా మారినప్పుడు, అశాంతి ప్రబలినప్పుడు వాటన్నింటికి సమాధానంగా ఆయనే వస్తారు’ అనే ఉపోద్ఘాతంతో మొదలైన టీజర్ ఆద్యంతం అబ్బురపరిచే విజువల్స్‌తో ఆకట్టుకుంది. ‘రామాయణం కాలాతీత గాథ. భారతీయ సజీవ సాంస్కృతిక శక్తికి నిదర్శనం. రాముడు ధర్మానికి, కరుణకు, నిస్వార్థతకు ప్రతీక’ అని దర్శకుడు అన్నారు.
రాముడి పాత్రలో రణబీర్‌కపూర్ ఆకట్టుకున్నారు. అయోధ్య నుంచి అరణ్యం వైపునకు సాగిన శ్రీరాముడి ప్రయాణాన్ని టీజర్లో చూపించారు. దాదాపు 4000 కోట్ల భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘రామాయణ’ చిత్రంలో యష్ (రావణుడు), సన్నీ డియోల్ (హనుమంతుడు), రవి దూబే (లక్ష్మణుడు) పాత్రల్ని పోషిస్తున్నారు. నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్, యష్ మాస్టర్‌మైండ్స్ క్రియేషన్స్ నిర్మాణ భాగస్వామ్యంలో రెండు భాగాలుగా ఐమ్యాక్స్ ఫార్మాట్లో ఈ సినిమా విడుదలకానుంది.