Ramya Sri | సీనియర్ నటి రమ్య శ్రీపై దాడి ఘటన ఇప్పుడు కలకలం రేపుతుంది. మంగళవారం గచ్చిబౌలి పోలీస్‌స్టేసన్ దగ్గరలోని ఎఫ్‌సీఐ కాలనీ లేఅవుట్లో హైడ్రా రోడ్ల మార్కింగ్ చేపట్టగా, ప్లాట్ యజమానుల సమక్షంలో అధికారులు మార్కింగ్ చేశారట. అయితే ప్లాట్ ఓనర్స్‌లో ఒకరైన రమ్య శ్రీ, ఆమె సోదరుడు ప్రశాంత్ దానిని వీడియో తీసారు. ఈ క్రమంలోనే సంధ్యా కన్వెన్షన్ యజమాని అయిన శ్రీధర్ అనుచరులు వారితో వాగ్వాదానికి దిగారు. మా స్థలంలో మేం వీడియో తీసుకుంటే మీకేంటి ఇబ్బంది అని రమ్యశ్రీ ప్రశ్నించగా.. వారు ఆగ్రహంతో రెచ్చిపోయారు.
క్రికెట్ బ్యాట్, కత్తితో రమ్యశ్రీతో పాటు, ఆమె సోదరుడిపైగా దాడికి యత్నించినట్లు సమాచారం.. ఈ ఘటనతో భయాందోళనకు గురైన బాధితులు నేరుగా గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ ఆగడాలకు అడ్డుకట్ట వేసి తమకు రక్షణ కల్పించాలని రమ్య శ్రీ తమ ఫిర్యాదులో పేర్కొంది. గచ్చిబౌలిలాంటి రద్దీ ప్రాంతంలో పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే పట్టపగలు ఇలా సినీ నటిపై దాడి జరగడం కలకలం రేపుతోంది. రమ్య శ్రీ సోదరుడు ప్రశాంత్‌కి చిన్నపాటి గాయాలు అయినట్టు తెలుస్తుంది. రమ్య శ్రీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నట్టు తెలుస్తుంది.
ఇక రమ్య శ్రీ విషయానికి వస్తే.. హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆమె ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేసి మెప్పించింది. బోల్డ్ క్యారెక్టర్స్ ఎక్కువగా చేసి ఆకట్టుకుంది. చాలా సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లోనూ మెరిశారు రమ్యశ్రీ. ఆమె అసలు పేరు సుజాత కాగా, సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత ఎక్కువ మంది ఆ పేరుతో ఉండటంతో తన పేరుని రమ్యశ్రీగా మార్చుకుంది. తెలుగు అమ్మాయి అయిన రమ్యశ్రీ కన్నడ ఇండస్ట్రీలో మొదటిగా నటించింది. కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్ గా 30కి పైగా సినిమాల్లో నటించింది రమ్యశ్రీ. కన్నడ, తమిళ, మళయాల, హిందీ, భోజ్ పురి భాషలలో 250 చిత్రాలలో నటించింది ఈ ముద్దుగుమ్మ.