రామ్‌చరణ్ ఎంత మంచి నటుడో మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ సినిమాలు నిరూపించేశాయ్. పాత్రలో సత్తా ఉండాలేకానీ.. అందులో జీవించేయడం తండ్రి నుంచి పుణికిపుచ్చుకున్నారు రామ్‌చరణ్. ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమా చేస్తున్నారు. ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో ఆయన ఆట కూలీగా కనిపించనున్నారు. రామ్‌చరణ్ పాత్రని ముందు పెట్టి, పలు క్రీడల్లో పందాలు కాస్తూ ఆ ఊరిలో కొందరు డబ్బు గడిస్తుంటారట. కథ రీత్యా ఇందులో రామ్‌చరణ్ అన్ని క్రీడల్లోనూ ఆరితేరి ఉంటారని వినికిడి. ఇటీవల రిలీజైన ఫస్ట్ గ్లింప్స్‌లో రామ్‌చరణ్ ఆహార్యం, శారీరక భాష, ఆట ఆడే తీరు ఆడియన్స్‌ని విపరీతంగా ఆకట్టుకున్నది. రికార్డు స్థాయి వ్యూస్‌తో ఆ గ్లింప్స్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ ఆర్ఎఫ్సీలో జరుగుతున్నది. ఈ షెడ్యూల్ అంతా నైట్ ఎఫెక్ట్‌తోనే సాగుతుందని సమాచారం. ఇందులో భాగంగా రామ్‌చరణ్, కథానాయిక జాన్వీకపూర్‌లపై ఓ రొమాంటిక్ సాంగ్‌ని చిత్రీకరిస్తున్నారు దర్శకుడు బుచ్చిబాబు.
వచ్చే ఏడాది మార్చి 27న సినిమాను విడుదల చేయనున్నట్టు నిర్మాత వెంకటసతీశ్ కిలారు ఇప్పటికే ప్రకటించారు కూడా. శివరాజ్‌కుమార్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: ఏ.ఆర్.రెహమాన్, కెమెరా: ఆర్.రత్నవేలు, సమర్పణ: మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్, నిర్మాణం: వృద్ధి సినిమాస్.