RanbirKapoor | బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం ‘రామాయణం’ టీజర్ వీఎఫ్ఎక్స్ (VFX) పై నెట్టింట మళ్లీ చర్చ మొదలైంది. ఇటీవల ఈ చిత్ర బృందం సినిమా సెట్స్‌లో కంటెంట్ క్రియేటర్ల కోసం ఒక ప్రత్యేక ఈవెంట్‌ను నిర్వహించగా.. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ సినీ కంటెంట్ క్రియేటర్ ధృవ్ పరిక్షిత్ సోషల్ మీడియాలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ సినిమా పబ్లిసిటీ కోసం, ఇంటర్నెట్లో చర్చలు జరగడం కోసమే మేకర్స్ కావాలనే తక్కువ నాణ్యత కలిగిన ‘రామ’ టీజర్‌ను విడుదల చేశారని ఆయన పేర్కొన్నారు. తాను సెట్స్‌ను సందర్శించినప్పుడు అక్కడి వీఎఫ్ఎక్స్ టీమ్ సభ్యుడితో మాట్లాడానని, టీజర్లో చూపించిన సీన్స్ కంటే చాలా బెటర్ వర్షన్స్ వారి దగ్గర సిద్ధంగా ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగానే అసంపూర్తిగా ఉన్న అవుట్‌పుట్‌ను వారు రిలీజ్ చేశారని సదరు టెక్నీషియన్ తనతో చెప్పినట్లు ధృవ్ మొదట కామెంట్స్ సెక్షన్లో రాసుకొచ్చారు. ఆ కామెంట్లో ఆయన సినిమా విజువల్స్ హాలీవుడ్ చిత్రం ‘అవతార్’ రేంజ్లో ఉన్నాయని కూడా ప్రశంసించారు.
అయితే ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో ధృవ్ వెంటనే ఆ కామెంట్‌ను డిలీట్ చేసి, దాని స్థానంలో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయంటూ కేవలం సినిమాను ప్రశంసిస్తూ కొత్త కామెంట్‌ను పోస్ట్ చేశారు. కానీ అప్పటికే నెటిజన్లు ఆయన పాత కామెంట్‌ను స్క్రీన్‌షాట్స్ తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసేశారు. కొన్ని నెలల క్రితం విడుదలైన ఈ చిత్ర మొదటి టీజర్లో రణబీర్ కపూర్ లుక్, సినిమా గ్రాండియర్ బాగున్నప్పటికీ కొన్ని డిజైన్స్ పై భారీగా విమర్శలు వచ్చాయి. ఆ లోపాలను సరిదిద్దుతామని మేకర్స్ అప్పట్లోనే ప్రకటించారు. రణబీర్ కపూర్, యష్, సాయి పల్లవి, రవి దూబే, సన్నీ డియోల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ భారీ చిత్రం మొదటి భాగం 2026 దీపావళి కానుకగా విడుదల కానుంది.