Ramayana | భారతీయ పురాణేతిహాసం రామాయణం దశాబ్దాలుగా ఇటు వెండితెరపై, అటు బుల్లితెరపై ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉంది. ఇప్పటికే తెలుగుతో పాటు వివిధ భారతీయ భాషల్లో రామాయణగాథ పలుమార్లు దృశ్యమానం అయిన విషయం తెలిసిందే. తాజాగా నితేశ్ తివారీ దర్శకత్వంలో రామాయణం ‘రామాయణ’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో సీతారాముల పాత్రల్లో సాయిపల్లవి, రణబీర్‌కపూర్ నటిస్తున్నారు. రావణాసురుడిగా కన్నడ అగ్ర నటుడు యష్ కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే తొలిభాగానికి సంబంధించిన యాభైశాతం చిత్రీకరణ పూర్తయింది.2026 దీపావళి కానుకగా తొలి పార్ట్ విడుదల చేయనున్నారు.
ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘రామాయణ’ ఇప్పటికే అన్ని వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ పౌరాణిక చిత్రంలోని పాత్రల ఎంపిక, టెక్నికల్ టీమ్, విజన్ అన్ని కలిపి గ్రాండ్ లెవల్లో రూపొందుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన చిన్న గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఇటీవల చిత్ర యూనిట్ కీలక విషయాలు వెల్లడించింది. ఇందులో ముఖ్యంగా రణ్‌బీర్ కపూర్ మరియు సాయిపల్లవి ఎంపికపై ఆసక్తికర విషయాలు తెలియజేశారు. రణ్‌బీర్‌ను రాముడిగా తీసుకోవడం వెనుక కారణం ఆయనలో ఉన్న అద్భుత నటనా నైపుణ్యం, సహజమైన ప్రశాంతత, ఆత్మవిశ్వాసం. రాముడి పాత్రక ఆయన సరిపోయాడని మేకర్స్ తెలిపారు.
సాయిపల్లవిని సీతాదేవిగా ఎంపిక చేయడం వెనుక కారణం ఏంటంటే ఆమె గ్లామర్ పాత్రలకి దూరంగా ఉండటం, అందం కోసం ఎలాంటి సర్జరీలు చేయించుకోకపోవడం వంటి కారణాలే ప్రధానమని చెప్పారు. కృత్రిమ అందంకన్నా సహజత్వమే పెద్దదని, ఆమె రూపం ఆ పాత్రను నమ్మదగినదిగా చేస్తుందని పేర్కొన్నారు. రెండు పార్ట్‌లుగా రూపొందుతున్న రామాయణ మొదటి భాగం 2026లో దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానుంది అని ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. ‘రామాయణ’ కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోంది. పాత్రల ఎంపిక, కథా నిర్మాణం, టెక్నికల్ డిపార్ట్మెంట్ పై భారీ నమ్మకం నెలకొంది. పౌరాణిక ఇతిహాసాన్ని అత్యాధునిక టెక్నాలజీతో తెరపైకి తీసుకురాబోతున్నారు మేకర్స్.