బాలీవుడ్ అగ్ర హీరో రణబీర్‌కపూర్ సరికొత్త వ్యాపారంలోకి ప్రవేశించారు. తాను రాముడి పాత్రను పోషిస్తున్న తాజా చిత్రం ‘రామాయణ’కు విజువల్ ఎఫెక్ట్స్ సమకూర్చుతున్న ప్రముఖ సంస్థ ప్రైమ్ ఫోకస్లో పెట్టుబడులు పెట్టారు. నితేశ్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారతీయ పురాణ ఇతిహాసం తాలూకు గ్లింప్స్‌ను ఇటీవలే విడుదల చేయగా..అబ్బుపరిచే గ్రాఫిక్స్ హంగులతో మెప్పించింది. చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రాకు చెందిన విజువల్ ఎఫెక్ట్స్ సంస్థ ప్రైమ్ ఫోకస్ ‘రామాయణ’ చిత్రానికి గ్రాఫిక్స్ హంగులను సమకూర్చుతున్నది. ప్రైమ్ ఫోకస్‌కు చెందిన డబుల్ నెగెటివ్ (డీఎన్ఈజీ) అనే విజువల్ ఎఫెక్ట్స్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది.
ఆస్కార్ విన్నింగ్ చిత్రాలైన టెనెట్, డ్యూన్-2, ఓపెన్‌హైమర్ వంటి చిత్రాలకు ఈ సంస్థ గ్రాఫిక్స్‌ను సమకూర్చడం విశేషం. తాజాగా ఈ సంస్థలో రణబీర్‌కపూర్ 20కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రైమ్ ఫోకస్ సంస్థకు చెందిన దాదాపు 13లక్షల షేర్లను ఆయన కొలుగోలు చేశాడని తెలిసింది. రణబీర్‌కపూర్ షేర్ ఇన్వెస్టిమెంట్ అనంతరం ప్రైమ్ ఫోకస్ సంస్థ షేర్ 85 రూపాయల నుంచి 175కి చేరుకోవడం విశేషం. దాదాపు 400కోట్లతో రెండు భాగాలుగా ‘రామాయణ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది దీపావళికి తొలిభాగం ప్రేక్షకుల ముందుకురానుంది.