Allu Arvind | ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్‌కు చెందిన రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ సంస్థకు సంబంధించిన రూ.101 కోట్ల బ్యాంక్ రుణ మోసం కేసులో విచారణకు రావాల్సిందిగా.. అల్లు అరవింద్‌ని ఈడీ ఆదేశించగా.. నేడు విచారణకు హాజరయ్యారు అరవింద్. ఈడీ కార్యాలయానికి హాజరైన అరవింద్‌ను అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ప్రధానంగా బ్యాంకు లావాదేవీలు, ఆస్తుల కొనుగోళ్లపై ఆరా తీశారు. విచారణ ఇంకా పూర్తికాకపోవడంతో, వచ్చే వారం మరోసారి హాజరుకావాలని ఈడీ ఆయనకు సూచించినట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే, రామకృష్ణ ఎలక్ట్రానిక్స్, రామకృష్ణ టెలిట్రానిక్స్ సంస్థలు 2017-19 మధ్య యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.101 కోట్ల రుణం తీసుకుని ఎగవేశాయని ఆరోపణలున్నాయి. ఈ నిధులను సంస్థ యజమానులు సొంత ప్రయోజనాలకు, అక్రమ నగదు బదిలీకి వాడినట్లు ఈడీ గుర్తించింది. సీబీఐ కేసు నమోదు చేయగా, మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తులో భాగంగా రామకృష్ణ సంస్థతో అల్లు అరవింద్‌కు చెందిన సంస్థల మధ్య అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు జరిగాయని ఈడీ అధికారులు గుర్తించారు. దీనిపై స్పష్టత కోరుతూ అల్లు అరవింద్ కు నోటీసులు జారీ చేశారు.