Ramabanam Movie | మ్యాచో స్టార్ గోపిచంద్ ఎన్ని విధాల ట్రై చేసిన హిట్టు మాత్రం కొట్టలేకపోతున్నాడు. ఆయన హిట్టు చూసి తొమ్మిదేళ్లయింది. ‘లౌక్యం’ తర్వాత ఇప్పటివరకు గోపిచంద్‌కు సరైన హిట్టే లేదు. మధ్యలో ‘గౌతమ్ నందా’, ‘సీటీమార్’ సినిమాలు పాజిటీవ్ టాకే తెచ్చుకున్నా.. కమర్షియల్‌గా సేఫ్ కాలేకపోయాయి. భారీ అంచనాలతో ఇటీవలే విడుదలైన ‘రామబాణం’ తొలిరోజే నెగెటీవ్ టాక్ తెచ్చుకుని పబ్లిసిటీ ఖర్చులు కూడా వెనక్కి తీసుకురాలేకపోయింది. తన కెరీర్లో రెండు భారీ విజయాలిచ్చిన శ్రీవాస్ సైతం ఈ సారి గోపిను కాపాడలేకపోయాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఓటీటీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఈ మధ్య ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా అయినా నెల రోజుల్లోపే వచ్చేస్తుంది. కాని రామాబాణం సినిమా రిలీజైన నాలుగు నెలలు దాటిన ఇంకా ఓటీటీలోకి కానరాలేదు. అసలు ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారా లేదంటే నేరుగా టీవీల్లో టెలికాస్ట్ చేస్తారా అని సందేహం కూడా ఓటీటీ ప్రియుల్లో మెదిలింది. కాగా ఇన్నాళ్లకు రామబాణం ఓటీటీలో సందడి చేసేందుకు ముస్తాబవుతుంది. సెప్టెంబర్ 14 నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సినిమా ఓటీటీ డీలింగ్ రిలీజ్‌కు ముందే పూర్తయింది. దాంతో ఈ కాంబోపై ఉన్న క్రేజ్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో ఏకంగా రూ.8 కోట్లకు ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసిందట. కానీ సినిమా అల్ట్రా డిజాస్టర్‌గా నిలిచిపోయింది.
పీపుల్ మీడియా బ్యానర్‌పై వివేక్ కూచిబొట్ల ఈ సినిమాను నిర్మించాడు. గోపిచంద్‌కు జోడీగా డింపుల్ హయతి నటించింది. రిలీజ్‌కు ముందు మేకర్స్ చేసిన హడావిడితో ఈ సినిమాపై మంచి హైపే క్రియేట్ అయింది. పైగా పీపుల్ మీడియా నుంచి వస్తున్న సినిమా కావడంతో హిట్టు బొమ్మ అని అందరు అనుకున్నారు. తీరా రిలీజయ్యాక తెలిసిన కథలనే శ్రీవాస్ మిక్సీలో వేసి రుబ్బాడని విమర్శలు వచ్చాయి. ఈ సినిమాకు రూ.15 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఫైనల్ రన్లో ఇందులో పావు వంతు షేర్‌ను కూడా సాధించలేక డిజాస్టర్‌గా మిగిలింది.