Ram Gopal Varma | సినీ పరిశ్రమను వదలకుండా వెంటాడుతున్న పైరసీ సమస్యపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన తన సోషల్ మీడియా వేదికగా చేసిన సుదీర్ఘ పోస్ట్ నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది. పైరసీని అరికట్టాలంటే కేవలం దానిని సరఫరా చేసేవారినే కాకుండా… చూసే ప్రేక్షకులను కూడా నేరస్తులుగా ట్రీట్ చేయాలని ఆయన సూచించారు. ఇటీవల ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో పరిశ్రమ మొత్తం పైరసీ సమస్యపై స్పందిస్తుండగా, వర్మ చేసిన ఈ కామెంట్లు మరింత వివాదం రేపుతున్నాయి.
ఆర్జీవీ తన పోస్ట్‌లో పైరసీ ఆగకపోవడానికి అసలు కారణం ప్రజల డిమాండ్‌నే అని పేర్కొన్నారు. పైరసీ ఎప్పటికీ ఆగదు. ఎందుకంటే టెక్నాలజీ ఎక్కువగా ఉన్నందుకూ కాదు, పోలీసుల నిఘా బలహీనంగా ఉన్నందుకూ కాదు. పైరసీ సినిమాలు చూసే ప్రేక్షకులు ఉన్నంతవరకు రవి లాంటి సరఫరాదారులు ఎప్పుడూ ఉంటారు ” అని వర్మ వ్యాఖ్యానించారు. అతడిని రాబిన్ హుడ్‌తో పోలుస్తున్న కొంతమందిని కూడా టార్గెట్ చేస్తూ… “ రాబిన్ హుడ్ హీరో కాదు, అతను మొదట టెర్రరిస్ట్. ధనవంతుల నుంచి దోచుకోవడం గొప్ప లాజిక్ కాదు ” అని వర్మ తేల్చి చెప్పారు.
పైరసీకి మద్దతు ఇస్తున్న కొంతమంది చూపే లాజిక్‌ను వ్యంగ్యంగా ఎండగట్టారు. “టికెట్ రేట్లు ఎక్కువా? -పైరసీ ఓకే.”, “పాప్‌కార్న్ ఖరీదా? — సినిమాను లీక్ చేయండి. ఈ లాజిక్ ప్రకారం… BMW కారు ఖరీదైతే షోరూమ్‌ను దోచుకోవాలి. బంగారం ఖరీదైతే షాపులను లూటీ చేయాలి అన్నట్టు అవుతుంది అని వ్యాఖ్యానించారు. ఇలాంటి ఆలోచనలు సమాజంలో అరాచకానికి దారితీస్తాయని ఆయన హెచ్చరించారు. మరోవైపు ఆయన నేను కూడా పైరేటెడ్ కంటెంట్ చూస్తాను. ప్రేక్షకులు నైతిక విప్లవం కోసం కాదు, తమ సౌలభ్యం కోసం మాత్రమే పైరసీ చూస్తారు అని చెప్పారు. నిజంగా పైరసీని ఆపాలంటే చూసే వారినీ నేరస్తులుగా పరిగణించాలి. పైరేటెడ్ కంటెంట్ చూస్తున్న 100 మందిని అరెస్ట్ చేసి, వారి పేర్లను పబ్లిక్‌గా ప్రకటించండి. భయం పనిచేస్తుంది… నైతికత కాదు అని వర్మ సూటి వ్యాఖ్యలు చేశారు.