ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు వివాదాలు కొత్తేమీ కాదు. నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన తన కొత్త సినిమా వివరాల్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. రాజకీయ నేపథ్య కథాంశంతో ‘వ్యూహం’ పేరుతో తొలి భాగాన్ని, ‘శపథం’ పేరుతో రెండో భాగాన్ని రూపొందించబోతున్నట్లు వర్మ తెలిపారు. ఈ సందర్భంగా సినిమాల వివరాల్ని వెల్లడిస్తూ వరుస ట్వీట్లు చేశారు. “వ్యూహం’ అనే పొలిటికల్ సినిమా తీయబోతున్నా. ఇది బయోపిక్ కాదు..అంతకన్నా లోతైన రియల్‌పిక్. బయోపిక్‌లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ..రియల్పిక్లో వందశాతం నిజాలే ఉంటాయి. అహంకారానికి, ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుంచి ఉద్భవించిన ‘వ్యూహం’ కథ రాజకీయ కుట్రలు, విషంతో నిండి ఉంటుంది. రెండు భాగాల్లోనూ రాజకీయ అరాచకాలు పుష్కలంగా ఉంటాయి’ అని రామ్‌గోపాల్‌వర్మ ట్విట్టర్లో పేర్కొన్నారు. గతంలో తాను తీసిన ‘వంగవీటి’ నిర్మాతే తాజా చిత్రాలకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తారని వర్మ తెలిపారు. రామ్‌గోపాల్‌వర్మ ఇటీవలే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ సమావేశంలో ఏం చర్చించారనే విషయాల్ని మాత్రం వెల్లడించలేదు. తాజా సినిమా ప్రకటనతో తాను తీయబోయే సినిమాల గురించి చర్చించడానికే రామ్‌గోపాల్‌వర్మ ఏపీ సీఎంను కలిశారని ఫిల్మ్‌నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.