Ram Gopal Varma | టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోలీసుల విచారణకు డుమ్మా కొట్టారు. గత వారం రామ్ గోపాల్ వర్మపై ఐటీ చట్టం కింద కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుపై నేడు విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. తాను రాలేనని పోలీసులకు చెప్పినట్లు తెలుస్తుంది.
గత వారం ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం పోలీస్ స్టేషన్లో ఐటీ చట్టం కింద రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేశారు పోలీసులు. వ్యూహం సినిమా సమయంలో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, నారా బ్రాహ్మాణిలను కించపరిచేలా రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టినందుకు గాను మద్దిపాడు టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఈ కేసును పెట్టాడు. ఇక రామలింగం ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు వర్మపై కేసు నమోదు చేశారు.
అయితే ఈ కేసుపై విచారణకు హాజరుకావాల్సిందిగా.. ఏపీ పోలీసులు వర్మకు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుల ప్రకారం మంగళవారం వర్మ కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. అయితే అంతకంటే ముందే వర్మ ఏపీ హైకోర్ట్‌ను ఆశ్రయించి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే వర్మ క్యాష్ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు వర్మ చేసిన వ్యాఖ్యల పట్ల పిటిషన్ కొట్టివేసింది. అలాగే అరెస్ట్ నుంచి తాము రక్షించలేమని వర్మ న్యాయవాదికి కోర్టు స్పష్టం చేసింది. ఏదైనా ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని సూచించింది.
ఇదిలావుంటే నేడు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరుకావాల్సి ఉంది వర్మ. అయితే, ఉదయం 10 గంటలకు తాను విచారణకు రాలేనంటూ ఆర్జీవీ పోలీసులకు మెసేజ్ చేసినట్లు తెలుస్తుంది. ఈ మేరకు వాట్సాప్ లో ఆయన మెసేజ్ చేసినట్లు తెలుస్తోంది. తనపై నమోదైన కేసుకు సంబంధించి పోలీసులకు సహకరిస్తానని చెప్పిన ఆర్జీవీ.. తన వ్యక్తిగత పనుల కోసం నాలుగు రోజుల సమయం కావాలని కోరినట్లు తెలుస్తుంది. అనంతరం తాను తప్పుకుండా విచారణకు హాజరవుతానని చెప్పినట్లు సమాచారం.