Ram | టాలీవుడ్లో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరోగా పేరు సంపాదించుకున్న రామ్ పోతినేనికి అందం, అభినయం, మాస్ క్రేజ్ అన్నీ ఉన్నాయి. కానీ కథల ఎంపిక విషయంలో జరుగుతున్న పొరపాట్లు అతన్ని స్టార్ హీరోల జాబితాలోకి తీసుకెళ్లడంలో అడ్డుపడుతున్నాయి. టైర్-2 హీరోలలో టాప్ ప్లేస్ దక్కించుకునే అన్ని అర్హతలూ ఉన్నా, ఇప్పటికీ రామ్ ఆశించిన స్థాయికి చేరుకోలేకపోతున్నారు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ కు ఒక హిట్టు పడలేదు. ఆ సినిమా విజయం చూసి మాస్ బాట పట్టిన రామ్, అదే ట్రాక్‌లో వరుసగా ఫ్లాపులు చవిచూశారు. ఈ పరాజయాల వల్ల ఇప్పుడు మళ్లీ తన పాత స్టైల్‌కి, లవ్ స్టోరీల వైపు మళ్లారు.
ప్రస్తుతం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో గుర్తింపు పొందిన దర్శకుడు మహేష్ బాబు పచ్చిగోల దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు రామ్. ఈ సినిమా పేరు ఆంధ్రా కింగ్ తాలూకా. హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తుండగా, ప్రముఖ నటుడు ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ తుది దశలో ఉన్నా, మేకర్స్ నుంచి ఇప్పటివరకు రిలీజ్ డేట్ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో రామ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఇటీవల అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘పరదా’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా హాజరైన రామ్, అక్కడ అభిమానుల సందడి మధ్య స్టేజ్ మీద మాట్లాడారు. ఈలలు, అరుపులు పెడుతూ ఫ్యాన్స్ హడావిడి చేయడంతో, “ఇది మన సినిమా ఈవెంట్ కాదు, మన సినిమా ఈవెంట్లో మాట్లాడుకుందాం” అంటూ వారిని సున్నితంగా కూల్ చేశారు. అయితే ఆ ఈవెంట్లో యాంకర్ నుంచి వచ్చిన ప్రశ్న..”ఆంధ్రా కింగ్ తాలూకా అప్డేట్ ఎప్పుడొస్తుంది?” అన్నదానికి, రామ్ సీరియస్‌గా స్పందిస్తూ, “పరదా సినిమా విడుదలకి ముందే (ఆగస్టు 22కి ముందు) మా సినిమా నుంచి అప్డేట్ ఇస్తాం” అని ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు.