రామ్‌చరణ్ ‘పెద్ది’ సినిమాను వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించిన విషయం విదితమే. అయినా సరే.. సినిమా షూటింగ్‌ని మాత్రం యమ స్పీడ్‌గా కానిచ్చేస్తున్నారు చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానా. బుధవారం నుంచి కొత్త షెడ్యూల్ మొదలైంది. ఇది పూర్తిగా నైట్ షెడ్యూల్ కావడం విశేషం. ఈ సినిమాలో నైట్ ఎఫెక్ట్ సీన్స్ చాలా ఉన్నాయట. ఈ సీన్స్ అన్నింటినీ ఈ షెడ్యూల్లోనే కంప్లీట్ చేస్తారని సమాచారం. రామ్‌చరణ్ ఇప్పటికే ఈ షెడ్యూల్లో ఎంటరయ్యారు.
త్వరలోనే జాన్వీ కపూర్ కూడా జాయిన్ అవుతారట. ఈ షెడ్యూల్లో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ కూడా ఉంటుందని సమాచారం. ఇందులో రామ్‌చరణ్ ఆట కూలీగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ ఆటా ఈ ఆటా అని కాకుండా, అన్ని ఆటల్నీ ఇందులో రామ్‌చరణ్ ఆడేస్తారట. ఇది పీరియాడికల్ మూవీ కావడంతో అప్పటి వాతావరణం కళ్లకు కట్టేలా, ఉత్తరాంధ్ర సంస్కృతి ఉట్టిపడేలా భారీ ఖర్చుతో సెట్టింగులు నిర్మిస్తున్నారట. ఈ చిత్రాన్ని మైత్రీమూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మిస్తున్న విషయం తెలిసిందే.