Game Changer | రామ్‌చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రం డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకురాబోతున్న విషయం తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో దిల్‌రాజు రూపొందించిన ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ప్రచార పర్వంలో భాగంగా ఇటీవలే రెండో పాటను విడుదల చేశారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభించడంతో టీజర్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నెలలోనే టీజర్‌ను రిలీజ్ చేస్తామని నిర్మాత దిల్‌రాజు కన్ఫర్మ్ చేశారు.
తాజా సమాచారం ప్రకారం దసరా సందర్భంగా ఈ నెల 12న టీజర్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. రాజకీయ, సామాజికాంశాలను చర్చిస్తూ తనదైన శైలిలో దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కియారా అద్వాణీ, అంజలి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, సముద్రఖని కీలక పాత్రలను పోషిస్తున్నారు.