Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కించిన భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన తొలి షో నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా కథ, నటన, సాంకేతిక విలువలతో పాటు బడ్జెట్, నటీనటుల పారితోషికాలపై కూడా సినీ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి.. భారీ సాంకేతిక బృందం, స్టార్ క్యాస్టింగ్ కారణంగా ఈ సినిమా ప్రారంభం నుంచే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, ‘పెద్ది’ బడ్జెట్లో గణనీయమైన భాగం నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికాలకే ఖర్చయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ దాదాపు రూ.100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
‘ఉప్పెన’తో సంచలన విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు సనకు సుమారు రూ.30 కోట్ల వరకు పారితోషికం అందినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అలాగే హీరోయిన్ జాన్వీ కపూర్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఇతర ప్రధాన నటీనటుల రెమ్యూనరేషన్లు కలిపి మరో రూ.35 నుంచి రూ.40 కోట్ల వరకు ఖర్చయినట్లు సమాచారం. అయితే ఈ పారితోషికాలపై చిత్ర నిర్మాణ సంస్థ లేదా మూవీ టీమ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఈ వివరాలు ట్రేడ్ వర్గాల అంచనాలుగా మాత్రమే భావించాలి. ట్రేడ్ విశ్లేషకుల అంచనాల ప్రకారం ‘పెద్ది’ మొత్తం నిర్మాణ వ్యయం రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల మధ్య ఉండొచ్చని తెలుస్తోంది. భారీ సెట్లు, విజువల్ ట్రీట్, యాక్షన్ ఎపిసోడ్స్, స్టార్ క్యాస్టింగ్, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందించబడిన ఈ చిత్రం టాలీవుడ్లో అత్యంత ఖరీదైన ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని చెబుతున్నారు.
‘ఉప్పెన’ సినిమాతో తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న బుచ్చిబాబు సన, తన కథల్లో భావోద్వేగాలకు పెద్దపీట వేస్తాడు. అదే తరహాలో ‘పెద్ది’లో కూడా స్పోర్ట్స్ డ్రామాతో పాటు గ్రామీణ నేపథ్యంలో నడిచే బలమైన ఎమోషన్స్, కుటుంబ అనుబంధాలు, సెంటిమెంట్ అంశాలను మిళితం చేసినట్లు తెలుస్తోంది. బుచ్చిబాబు ప్రత్యేకమైన కథన శైలికి రామ్ చరణ్ పవర్ఫుల్ నటన తోడవడంతో ప్రేక్షకులను సినిమా బాగా ఆకట్టుకుంటోందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక రామ్ చరణ్ – జాన్వీ కపూర్ జంట కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు శివరాజ్ కుమార్, జగపతి బాబు, బోమన్ ఇరానీ, దివ్యేందు శర్మ వంటి అనుభవజ్ఞులైన నటులు తమ పాత్రలకు మరింత బలం చేకూర్చినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు.