Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా తాజాగా చరణ్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ధురంధర్ 2 సినిమాపై రామ్ చరణ్ ప్రశంసలు కురిపించారు. “ధురంధర్ ది రివెంజ్ చాలా ఉత్కంఠభరితంగా ఉంది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది” అంటూ ఆయన పేర్కొన్నారు.
దర్శకుడు ఆదిత్య ధర్ పనితీరును కొనియాడుతూ, “ఈ సినిమా స్థాయి, భావోద్వేగాలను అద్భుతంగా తెరకెక్కించారు. ఆయన పనితనం నిజంగా ఆశ్చర్యకరం” అని తెలిపారు. ఈ సినిమాలో హీరోగా నటించిన రణ్వీర్ సింగ్ తన ఎనర్జీ, నటనతో మరోసారి ప్రేక్షకులను మెప్పించారని చరణ్ అన్నారు. అలాగే ఆర్ మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ తమ పాత్రల్లో అద్భుతంగా నటించారని చెప్పారు. చిన్న వయసులోనే మంచి నటనతో ఆకట్టుకున్నసారా అర్జున్‌ని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. సంగీత దర్శకుడు శాశ్వత్ సచ్దేవ్ అందించిన సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని తెలిపారు.
ఇప్పటికే ఈ సినిమాపై మహేష్ బాబు, అల్లు అర్జున్,రామ్ గోపాల్ వర్మ వంటి ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు రామ్ చరణ్ ట్వీట్ కూడా రావడంతో ‘ధురంధర్ 2’ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. మార్చి 19న విడుదలైన ధురంధర్ 2 సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. గతంలో వచ్చిన మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో, ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వాటిని అందుకునేలా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.