రామ్చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమా విడుదల వాయిదా పడే అవకాశముందని గత కొద్దిరోజులుగా సోషల్మీడియాలో ప్రచారం జరుగుతున్నది. షూటింగ్ ఆలస్యమవుతున్న కారణంగా ముందుగా ప్రకటించినట్లుగా మార్చి 27న సినిమా వచ్చే అవకాశం లేదని వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో పుకార్లకు చెక్ పెడుతూ సినిమా విడుదల తేదీపై మేకర్స్ స్పష్టతనిచ్చారు. అనుకున్న సమయానికే ‘పెద్ది’ రానున్నట్లు ప్రకటించారు.
మంగళవారం చిత్ర సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ నిర్మాణ సంస్థ ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో ‘పెద్ది’ సినిమా మార్చి 27న రానున్నట్లు వెల్లడించింది. రామ్చరణ్ పుట్టిన రోజైన మార్చి 27న చిత్రాన్ని విడుదల చేస్తామని మేకర్స్ నిర్మాణ దశలోనే తెలియజేశారు. అదే రోజున సినిమా విడుదల పక్కా అని అభిమానులు నమ్మకంగా ఉన్నా..సోషల్మీడియా పుకార్లు వారిని సందేహంలో పడేశాయి.
ఈ నేపథ్యంలో ప్రొడక్షన్స్ హౌజ్ నుంచి ప్రకటన రావడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’ పాట పాపులర్ కావడంతో రెండో పాట కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి రోజున రెండో పాట విడుదల కానున్నట్లు సమాచారం. రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’లో రామ్చరణ్ ఆటకూలి పాత్రలో కనిపించనున్నారు.